టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ ఉదయ్ భాను ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు' (D/o Prasad Rao: Kanabadutaledhu). గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సిరీస్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఉదయభాను రీ ఎంట్రీ ఇచ్చారు.
కథా నేపథ్యం
ఈ వెబ్ సిరీస్ ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే గాఢమైన అనుబంధం చుట్టూ తిరుగుతుంది. రాజీవ్ కనకాల 'ప్రసాద్ రావు' అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో కనిపిస్తుండగా, నటి వసంతిక ఆయన కూతురు 'స్వాతి' పాత్రలో నటించింది. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఎంతో కష్టపడి ఉద్యోగంలో చేరిన స్వాతి, అందరూ గర్వపడేలా ఎదుగుతుంది. అయితే, కథలో ఊహించని మలుపు స్వాతి అదృశ్యం కావడంతో మొదలవుతుంది. తన ప్రాణప్రదమైన కూతురు ఏమైందో తెలియక ఆ తండ్రి పడే వేదన, ఈ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న మిస్టరీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి.
పోలీస్ ఆఫీసర్‌గా ఉదయభాను
ఈ కేసును ఛేదించే బాధ్యతను పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా ఉదయభాను స్వీకరిస్తుంది. చాలా కాలం తర్వాత ఉదయభాను ఒక సీరియస్ రోల్‌లో కనిపించడం ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. స్వాతిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆమెను టార్గెట్ చేయడం వెనుక ఉన్న సామాజిక కారణాలు ఏంటి? క్లిష్టమైన ఈ కేసును ఉదయభాను ఎలా ఛేదించిందనేది కథలో కీలకమైన అంశం.
ఎక్కడ ఎప్పుడు చూడాలంటే?
దర్శకుడు పోలూరు కృష్ణ ఈ సిరీస్‌ను ఎంతో భావోద్వేగభరితంగా మలిచారు. గతంలో 'రెక్కీ', 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' వంటి సక్సెస్‌ఫుల్ కంటెంట్‌ను అందించిన సౌత్ ఇండియన్ స్క్రీన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. మేకింగ్ పరంగా, కథనం పరంగా నాణ్యత విషయంలో రాజీ పడలేదని మేకర్స్ వెల్లడించారు.. సస్పెన్స్ పాయింట్లతో పాటు ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఎట్టకేలకు ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జీ 5' ( zee5 )లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ఎలాంటిరికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
