- డిసెంబర్ లోపు విహారయాత్రలు పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు మన దేశ సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన కల్పించేందుకు ఈ విహారయాత్రలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్రలన్నీ డిసెంబర్ లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులు కూడా మ్యూజియాన్ని సందర్శించవచ్చన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మ్యూజియాన్ని సందర్శించాలనుకునే పాఠశాలలు కనీసం 48 గంటల ముందే 'education salarjungmuseum@gmail.com' మెయిల్ ఐడీకి సమాచారం అందించి ముందస్తు బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి 30 మంది పిల్లలకు కనీసం ఒక టీచర్ తోడుగా ఉండాలని, ట్రిప్‌కు వెళ్లే ముందు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని సూచించారు.
