- కొత్తగూడెంపై పొంగులేటి, సత్తుపల్లిపై తుమ్మల నజర్
- జనరల్ అయినా సత్తుపల్లి నుంచి పోటీ చేసే ప్లాన్ లో సండ్ర
- కొత్తగూడెం అసెంబ్లీ నుంచి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పోటీకి చాన్స్
- మూడు సీట్లు పెరిగే అవకాశాలతో కొత్త రాజకీయ సమీకరణాలు
ఖమ్మం, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై ఊహాగానాలు జోరందుకున్న వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రిజర్వేషన్లు మారితే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక నాయకులతో సంబంధాలు బలోపేతం చేసుకుంటూ, భవిష్యత్ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి కాకుంటే మరో స్థానం అంటూ ఆల్టర్నేటివ్ నియోజకవర్గంలోనూ కేడర్‌ను పెంచుకుంటున్నారు.
రాజకీయ పరిస్థితులు ఎటొచ్చినా భవిష్యత్‌కు ఇబ్బంది లేకుండా అక్కడి లోకల్లీడర్లతో ఇప్పటి నుంచే టచ్‌లో ఉంటున్నారు. ఇటీవల జగన్నాథపురం రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాలు 182కు పెరుగుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా, మరో మూడు సీట్లు కొత్తగా పెరిగే చాన్సుందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో ప్రస్తుతం మూడు జనరల్ స్థానాలుండగా, రెండు ఎస్సీ, మిగిలిన ఐదు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. పునర్విభజన జరిగితే ప్రస్తుతమున్న రిజర్వేషన్లు కూడా మారడం ఖాయం.
కొత్తగూడెంపై పొంగులేటి ఫోకస్..
ప్రస్తుతం పాలేరు నుంచి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిజర్వేషన్ మారి, పాలేరు ఎస్సీలకు కేటాయిస్తే పొంగులేటి కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి పోటీ చేయొచ్చనే అంచనాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కొత్తగూడెం నుంచి పొంగులేటి పోటీపై ప్రచారం జరిగింది.
అప్పట్లోనే అక్కడ క్యాంప్ ఆఫీస్ ను ఏర్పాటు చేసుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తు నేపథ్యంలో కొత్తగూడెంను కామ్రేడ్లు దక్కించుకోగా పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. మంత్రి అయ్యాక కూడా తరచుగా కొత్తగూడెంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆయన అటెండవుతున్నారు. గతేడాది కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత సీపీఐతో పొత్తును పక్కనబెట్టి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం కూడా అక్కడ పొంగులేటి తన బలం పెంచుకోవడానికేనన్న విశ్లేషణలున్నాయి.
తన నియోజకవర్గంలో మంత్రి ఎక్కువగా తలదూర్చుతున్నారంటూ ఒకానొక సందర్భంలో లోకల్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరులో రిజర్వేషన్ కలిసి రాకుంటే ప్రత్యామ్నాయంగా కొత్తగూడెంపై పొంగులేటి కన్నేసినట్టు తెలుస్తోంది.
తుమ్మల సత్తుపల్లి వెళ్తారా?
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. పునర్విభజనలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే సత్తుపల్లిని తుమ్మల ఎంపిక చేసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. 1983లో ఆయన రాజకీయ జీవితం సత్తుపల్లి నుంచే ప్రారంభమైంది. ఆరుసార్లు సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా, మూడు సార్లు విజయం సాధించారు. 2009లో జనరల్ సీటు నుంచి ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన ఖమ్మంకు షిఫ్ట్ అయ్యారు. రెండు సార్లు ఖమ్మం నుంచి, ఒకసారి ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి గెలిచారు. ఇప్పుడు కూడా రిజర్వేషన్ల కారణంగా నియోజకవర్గం మారాల్సి వస్తే తుమ్మల సత్తుపల్లికి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్లోనూ చర్చ..
నియోజకవర్గాల పునర్విభజనపై అధికార పార్టీలోనే కాదు బీఆర్ఎస్ లీడర్లలోనూ చర్చ జరుగుతోంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుంచి మూడుసార్లు, పాలేరు నియోజకవర్గం నుంచి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి ఎన్నికల్లో సత్తుపల్లిలో ఓటమి పాలయ్యారు. సత్తుపల్లిలో ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్ కు మారితే మధిర లేదా పాలేరు నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలోకి దిగొచ్చని ప్రచారం జరిగింది.
అయితే జనరల్ గా మారినా సత్తుపల్లి నుంచి మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్‌ను సండ్ర కోరినట్టు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) కూడా మరోసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన తర్వాత బీఆర్ఎస్ లో చేరి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. రిజర్వేషన్ కలిసి వస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకు తగిన విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
