జూబ్లీహిల్స్, వెలుగు: డ్రైవింగ్ రాకపోయినా కారు నడిపిన ఓ బాలుడి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టింది. మధురానగర్ పీఎస్పరిధిలోని కార్మిక నగర్ ఎల్‌ఆర్ కిషోర్ స్కూల్ సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కార్మికనగర్‌కు చెందిన నవాజ్ ఉదయం ఓ అద్దె కారును తీసుకొచ్చాడు. దానిని ఇంటి ముందు నిలిపి వాహనం తుడవాలని స్థానికంగా ఉండే ఓ బాలుడికి చెప్పాడు. అతడికి డ్రైవింగ్ రానప్పటికీ ఎవరికీ చెప్పకుండా కారును స్టార్ట్ చేసి ఎల్‌ఆర్ కిషోర్ స్కూల్ వైపు పోనిచ్చాడు.
అదే సమయంలో స్కూల్ పక్కనే నివాసం ఉండే రాజ్ కుమార్ (60), ప్రభాకర్ (55) అనే అన్నదమ్ములు చర్చికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బాలుడు కారు వేగాన్ని కంట్రోల్చేయ లేక కన్ఫ్యూజన్లో బ్రేక్ వేయ బోయి యాక్సిలరేటర్ గట్టిగా తొక్కాడు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఇళ్ల ఎదుట పార్క్ చేసి ఉన్న టూవీలర్లపై నుంచి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న అన్నదమ్ముల బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న రాజ్ కుమార్ కారు వెనుక టైర్ కింద ఇరుక్కుపోయాడు. బైక్ నడుపుతున్న ప్రభాకర్ మీది నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది గమనించిన స్థానికులు కారును పైకి లేపి రాజ్ కుమార్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరోవైపు తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన రాజ్ కుమార్‌కు కొద్దికాలం కింద పక్షవాతం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవల కోలుకొని స్వయంగా నడవడం మొదలుపెట్టాడు. ఆదివారం ఉదయం చర్చికి వెళ్దామని అనుకోగా ఇలా ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
