- ముందుగానే రద్దీని గుర్తించి కంట్రోల్ చేయొచ్చు
- గత అనుభవాల నేపథ్యంలో లేటెస్ట్ టెక్నాలజీ వాడకం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే ‘ఫేషియల్ రికగ్నిషన్’ టెక్నీలజీని ఉపయోగించామన్నారు. దీని వల్ల పాత నేరస్తులు, గొలుసు దొంగలు, జేబు దొంగలను గుర్తించి పట్టుకోవచ్చన్నారు. ఏఐ క్రౌడ్మేనేజ్మెంట్లో భాగంగా ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను ‘థ్రెషోల్డ్ మ్యాపింగ్’ ద్వారా కచ్చితంగా లెక్కించవచ్చు. పరిమితికి మించి రద్దీ పెరిగితే అక్కడికి వెళ్లి కంట్రోల్‌చేసి తొక్కిసలాటలు జరగకుండా నివారించొచ్చు.
ఎలా పని చేస్తాయంటే..
ఏఐ కెమెరాలు ఆలయ ప్రాంగణం లేదా క్యూలైన్లను నిరంతరం గమనిస్తుంటాయి. ఈ సిస్టమ్‌లోని అల్గారిథమ్స్ మనుషుల తలలు, భుజాలు లేదా శరీర ఆకారాలను గుర్తిస్తాయి. ఒక ఫ్రేమ్‌లో (ఫొటో లేదా వీడియో భాగంలో) ఎంతమంది మనుషులు నిలబడి ఉన్నారో ఏఐ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా లెక్కగడుతుంది. డెన్సిటీ ఎస్టిమేషన్ అండ్ హీట్ మ్యాపింగ్ కేవలం తలలు లెక్కించడమే కాకుండా, ఒక నిర్దిష్ట స్థలంలో జనం ఎంత ఒత్తిడిగా ఉన్నారో విశ్లేషిస్తుంది.
దీనికోసం ‘హీట్ మ్యాప్’ టెక్నాలజీ వాడతారు. ఇందులో తక్కువ జనం ఉన్న ప్రాంతాలు నీలం (బ్లూ) లేదా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. రద్దీ విపరీతంగా పెరిగే కొద్దీ ఆ రంగు పసుపు, ఆపై ఎరుపు (రెడ్) రంగులోకి మారుతుంది. ఎక్కడైతే ఎరుపు రంగు మ్యాప్ ఏర్పడుతుందో, అక్కడ ప్రమాదకర స్థాయిలో రద్దీ ఉందని ఏఐ గుర్తిస్తుంది. జనం ఏ దిశగా కదులుతున్నారు? వారి నడక వేగం ఎంత? అనే అంశాలను గమనిస్తుంది. ఒకే వైపునకు జనం వేగంగా వెళుతున్నారా, లేక ఎక్కడైనా జనం నిలబడిపోయి ట్రాఫిక్ జామ్ లాంటి పరిస్థితి ఏర్పడిందా అని విశ్లేషిస్తుంది.
ఉదాహరణకు ఒక క్యూలైన్ రూమ్‌లో లేదా బారికేడ్ల మధ్య గరిష్టంగా 500 మంది మాత్రమే పట్టే అవకాశం ఉందనుకోండి. ఆ పరిమితిని ‘థ్రెషోల్డ్’ అంటారు. ఆ ప్రాంతంలో జనాల సంఖ్య 450 దాటగానే, ఏఐ సిస్టమ్ వెంటనే సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లోని పోలీసు అధికారులకు ఆటోమేటిక్‌గా ఒక వార్నింగ్ (అలర్ట్, అలారమ్) పంపుతుంది. దీని వల్ల పోలీసులు అప్రమత్తమై కొత్తగా భక్తులను లోపలికి పంపడం తాత్కాలికంగా నిలిపివేసి, తొక్కిసలాట జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోగలుగుతారు.
ఏఐ క్రౌడ్ మేనేజ్‌మెంట్ అంటే ?
ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ అనేది ఏఐ ద్వారా కంప్యూటర్ విజన్, అధునాతన అల్గారిథమ్‌లను ఉపయోగించి జనసమ్మర్ధాన్ని లేదా రద్దీని అంచనా వేసే, పర్యవేక్షించే ఒక లేటెస్ట్టెక్నాలజీ. సాధారణంగా భారీ జాతరలు, ఉత్సవాలు లేదా సభలు జరిగే ప్రాంతాల్లో లక్షలాది మంది గుమిగూడుతుంటారు. ఈ టైంలో ఎక్కడైనా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందా, ఎక్కడైనా జనాల రద్దీ ఒకేచోట విపరీతంగా పేరుకుపోతోందా అనే విషయాలను ఈ ఏఐ ముందుగానే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తుంది.
