- తెలంగాణలో ‘10 కోట్ల డ్రగ్ ఫ్రీ ప్రతిజ్ఞ’ ఉద్యమానికి శ్రీకారం
- డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత, విద్యార్థులతో ప్రతిజ్ఞ
హైదరాబాద్, వెలుగు: నషా ముక్త్ భారత్ తోనే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశాన్ని నషా ముక్త్ భారత్ గా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని చెప్పారు. ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో యువత, విద్యార్థులతో కలిసి డిజిటల్ స్క్రీన్ పై ఈ కార్యక్రమాన్ని గవర్నర్ వీక్షించారు.
‘10 కోట్ల డ్రగ్- ఫ్రీ ప్రతిజ్ఞ’ ఉద్యమాన్ని ప్రారంభించి, యువత, విద్యార్థులతో యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కలలుగన్న ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ఒక ప్రజా ఉద్యమమన్నారు. దేశ బలం యువతేనని, ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన యువతతోనే ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. దేశ జనాభాలో దాదాపు 65 శాతం యువతే ఉన్నారని, వారు వ్యసనాల బారిన పడకుండా కాపాడటం అత్యంత ముఖ్యమని తెలిపారు.
డ్రగ్స్ వ్యక్తి ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబ సంతోషాన్ని, దేశ ప్రగతిని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. యువత ఆధ్యాత్మిక విలువలు, యోగా, క్రీడలు, నైతిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. వచ్చే 100 వారాలపాటు వాక్‌థాన్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, ప్రతిజ్ఞల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ‘10 కోట్ల డ్రగ్ డీ-అడిక్షన్ ప్లెడ్జ్’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. వ్యసన నిర్మూలన సందేశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లనున్న బ్రహ్మకుమారీస్ సభ్యులకు జెండాలను అందజేశారు. '10 కోట్ల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ ఉద్యమం' నషా ముక్త్ భారత్ ప్రచారం కోసం బ్రహ్మకుమారీస్ ప్రత్యేకంగా సిద్ధం చేసిన మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దానకిశోర్, బ్రహ్మకుమారీస్ హైదరాబాద్ సంచాలకురాలు రాజయోగిని బీకే కుల్దీప్ దీదీ, మైభారత్ తెలంగాణ డైరెక్టర్ అన్వేష్, బ్రహ్మకుమారీస్ సంస్థ సీనియర్ ప్రతినిధులు, మై భారత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
