సైబరాబాద్‌‌‌‌లో బయోడైవర్సిటీ సెంటర్..కాంక్రీట్ జంగిల్‌‌‌‌లో మూగజీవాలకు అభయం

సైబరాబాద్‌‌‌‌లో బయోడైవర్సిటీ సెంటర్..కాంక్రీట్ జంగిల్‌‌‌‌లో మూగజీవాలకు అభయం
  • శేరిలింగంపల్లి అశోకవనంలో 'కబ్- కేర్' ఏర్పాటు
  • గాయపడిన పక్షులు, జంతువులకు 24 గంటల వైద్యం
  • జీవులను కాపాడేందుకు ప్రత్యేక రెస్క్యూ టీమ్‌‌‌‌లు

హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్ జంగిల్‌‌‌‌గా మారుతున్న నగరంలో తమ సహజ ఆవాసాలను కోల్పోయి ఆపదలో చిక్కుకుంటున్న మూగజీవాలకు ఆపన్నహస్తం అందించేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. నగర జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా శేరిలింగంపల్లిలోని అశోకవనం పార్కులో ప్రత్యేక జంతు జీవవైవిధ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ‘కబ్ -కేర్’ (సైబరాబాద్ పట్టణ జీవవైవిధ్య అవగాహన, పరిరక్షణ, పునరావాస కేంద్రం) పేరుతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సీఎంసీ స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సీఎంసీలోని అర్బన్ బయోడైవర్సిటీ ఫండ్ నుంచి దీనికి ప్రాథమిక నిధులు సమకూర్చనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రాన్ని ‘యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ’ (ఏడబ్ల్యూసీఎస్​) అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుండటంతో కార్పొరేషన్‌‌‌‌కు కొంతమేరకు నిర్వహణ భారం తగ్గనుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఎన్జీవో సంస్థ సాంకేతిక, వైద్య, రెస్క్యూ సేవలను అందించనుంది.

ఆపదలో అభయం..

నగరంలో వాహనాల రాకపోకలు, విద్యుత్ తీగలు, భవనాల నిర్మాణాలు, మానవ కార్యకలాపాల వల్ల నిత్యం అనేక పక్షులు, చిన్నపాటి వన్యప్రాణులు గాయపడుతున్నాయి. ఇలాంటి జీవులను రక్షించి, వాటికి తగిన చికిత్స అందించడమే 'కబ్-కేర్' ప్రధాన ఉద్దేశం. యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ భాగస్వామ్యంతో పనిచేసే ఈ కేంద్రంలో ఆపదలో ఉన్న జీవులను కాపాడేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయి.

గాయపడిన ప్రాణులకు 24 గంటలూ వైద్యం అందించేలా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాటికి శస్త్రచికిత్సలు చేసేందుకు వెటర్నరీ క్లినిక్, అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. చికిత్స అనంతరం ఆయా జీవులు పూర్తిగా కోలుకుని, తిరిగి ప్రకృతిలోకి వెళ్లేవరకు సహజసిద్ధమైన షెల్టర్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

జూపార్కుపై తగ్గనున్న ఒత్తిడి..

రాష్ట్రంలో ఎక్కడైనా అడవి జంతువులు లేదా పక్షులు గాయపడితే వాటిని బహదూర్‌‌‌‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌‌‌కు తరలిస్తున్నారు. దీనివల్ల జూ ఆఫీసర్లు, సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోనే 'కబ్- కేర్' అందుబాటులోకి వస్తే తక్షణ వైద్యం అందించి, జూపార్కు సిబ్బందిపై భారాన్ని తగ్గించవచ్చు. ఈ కేంద్రం జంతువుల ఆస్పత్రిగానే కాకుండా, జీవవైవిధ్య అవగాహన వేదికగా పనిచేస్తుంది.

సీఎంసీ పట్టణ జీవవైవిధ్య విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పర్యావరణ సమతుల్యత, జీవుల రక్షణపై అవగాహన కల్పిస్తారు. జంతు ప్రేమికులకు, యువతకు సురక్షితమైన రెస్క్యూ పద్ధతులపై వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లు నిర్వహించేలా ప్లాన్​చేస్తున్నారు.

కాలనీల్లోకి పాములు, కోతులు వచ్చినా భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా ఎలా డీల్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నగర ప్రగతితోపాటు పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో 'కబ్ -కేర్' కేంద్రం ఆదర్శంగా నిలవనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు