ఏపీ వ్యాప్తంగా ఆలయాలు మూతపడనున్నాయి.. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అన్ని ఆలయ ద్వారాలు మూతపడనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఏపీలోని అన్ని ఆలయాల ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు దేవదాయశాఖ అధికారులు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజుల్లో ఆలయాలు మూసివేత ప్రతియేటా జరిగేదే. ఈ క్రమంలో మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయని తెలిపారు అధికారులు.
ఈ క్రమంలో ఆలయాల్లో అన్నీ ఆర్జితసేవలు, పరోక్షసేవలు, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం టికెట్లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీశైలంలోని సాక్షిగణపతి, హాఠకేశ్వరం–ఫాలధార - పంచధార ,శిఖరేశ్వరం మొదలైన పరివార ఆలయాల ద్వారాలను కూడా మూసివేయనున్నట్లు తెలిపారు అధికారులు. దేవస్థాన దత్తత దేవాలయాలలో కూడా ఆలయద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు.
మార్చి 3వ తేదీ ఉదయం గం. 3.00లకు ఆలయద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత: కాలపూజలు, మహామంగళహారతులు జరుగుతాయని... మహామంగళహారతులు సమయం నుంచి ( ఉదయం 4: 30 గంటల నుంచి 5.30 గంటల వరకు ) మాత్రమే భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం, అమ్మవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు అధికారులు.
ఉదయం ఆరు గంటలకు శ్రీస్వామిఅమ్మవార్ల ఆలయద్వారాలు మూసివేయనున్నామని... తిరిగి రాత్రి 7: 30 గంటలకు ఆలయ ద్వారాలను తెరచి ఆలయశుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 9 గంటలకు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
మహామంగళహారతుల సమయం నుంచి ( రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల వరకు) భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం, శ్రీఅమ్మవారి దర్శనం ఉంటుందని తెలిపారు.గ్రహణం సమయంలో అన్నప్రసాదవితరణ కూడా నిలిపేయనున్నట్లు తెలిపారు అధికారులు.
