T20 World Cup: చిత్తుగా ఓడిన ఇటలీ.. 42 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్

T20 World Cup: చిత్తుగా ఓడిన ఇటలీ.. 42 పరుగుల తేడాతో గెలిచిన వెస్టిండీస్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గ్రూప్–సీలో భాగంగా ఇటలీతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఇటలీ టీం బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఆరంభంలో బాగానే ఆడినా, మధ్య ఓవర్లలో ఇటలీ బౌలర్ల ధాటికి పరుగులు చేయలేకపోయింది. బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కరేబియన్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (75) ఒక్కడే జట్టును ఆదుకున్నాడు. చివర్లో రోస్టన్ చేజ్ (24), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (24) ఫర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ బ్యాటర్లు 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేశారు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు వెస్టిండీస్ చేసిన స్కోర్లలో ఇది అతి తక్కువ స్కోర్‌ అని చెప్పాలి. 


165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ ఆరంభంలో దూకుడుగా ఆడింది. మోస్కా బ్రదర్స్ వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించారు. కానీ వెంటనే వెస్టిండీస్ పేస్ దళం రంగంలోకి దిగింది. మ్యాథ్యూ ఫోర్డ్ బౌలింగ్‌లో కీలకమైన టాప్ ఆర్డర్ ఇటలీ బ్యాటర్లను ఔట్ చేశాడు. షమార్ జోసెఫ్ తన పదునైనా బౌలింగ్ తో చెలరేగి నాలుగు వికెట్లు పడగొట్టాడంతో మ్యాచ్‌ పూర్తిగా విండీస్ వైపు తిరిగింది. 18 ఓవర్లు ఆడిన ఇటలీ జట్టు కేవలం 123 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇటలీపై విజయం ద్వారా వెస్టిండీస్ జట్టు సూపర్‌– 8 దశకు చేరుకుంది. వరుస విజయాలతో ముందుకు కొనసాగుతున్న కరేబియన్ జట్టు, టోర్నమెంట్ కీలక దశలోకి అడుగు పెడుతోంది. ఇటలీ తొలి వరల్డ్ కప్ ప్రయాణం ఇక్కడితో ముగిసినా, భవిష్యత్తులో మరింత బలంగా తిరిగిరావాలనే ఆశలను వారికి ఈ టోర్నమెంట్ మిగిల్చింది.