సీఎం ఇంటి పరిసరాలు ఎలా ఉంటాయి..? టైట్ సెక్యూరిటీతో ఎప్పటికప్పుడు చెకింగ్స్ తో.. ఎప్పుడూ మూడో కన్ను గమనిస్తూనే ఉంటుంది ఆ ఏరియాలో. అలాంటిది సీఎం ఇంటి ముందే చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు ఓ యువతీ యువకుడు. దోచుకున్న నగలతో పరారైన జంట.. ఆంధ్రప్రదేశ్ లోని తమ సొంత గ్రామానికి వెళ్తుండగా సూర్యాపేటలో పోలీసులకు చిక్కారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్రెడ్డి నివాసానికి సమీపంలో చోటుచేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటనలో యువతితో పాటు మరో నిందితుడిని పోలీసులు బుధవారం (ఫిబ్రవరి 19) అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం (ఫిబ్రవరి 17) ఉదయం మాదాపూర్ లోని హాస్టల్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం.39లోని ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మానస మెడలోంచి చైన్ లాక్కెల్లారు దుండగులు. యాక్టివా బైక్ మీద వచ్చిన ఆగంతకులు గొలుసు లాక్కెళ్లిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో యాక్టివా బైక్ నడిపించిన యువకుడు నరేంద్ర(23)తో పాటు గొలుసు లాగిన యువతి రేవతి (33) స్నేహితులు. వీరిద్దరూ సనత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటారని పోలీసుల విచా రణలో తేలింది. సీసీ ఫుటేజీలు, యాక్టివా బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా బైక్ నడిపిన యువకుడు ర్యాపిడో డ్రైవర్ అని గుర్తించారు క్రైం బ్రాంచ్ పోలీసులు. అతడి ఫోన్ నంబర్ ఆధారంగా వారి కదలికలపై దృష్టి పెట్టారు.
స్నాచింగ్ చేసిన అనంతరం నిందితులిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని తమ సొంతూళ్లకు పారిపోతున్న విషయాన్ని పసిగట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా సూర్యాపేటలో బుధవారం (ఫిబ్రవరి 18) మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కలిసి జల్సాల కోసం స్నాచింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు.
