T20 World Cup: గ్రూప్ స్టేజ్‎లో ఓటమన్నదే లేదు.. నెదర్లాండ్స్‎పై భారత్ ఘన విజయం

T20 World Cup: గ్రూప్ స్టేజ్‎లో ఓటమన్నదే లేదు.. నెదర్లాండ్స్‎పై భారత్ ఘన విజయం

గాంధీనగర్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. బుధవారం (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన చివరి గ్రూప్ మ్యాచులో నెదర్లాండ్స్‎పై టీమిండియా ఘన విజయం సాధించింది. శివమ్ దూబే (66) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బౌలింగ్‎లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయడంతో నెదర్లాండ్స్‎పై భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.

తద్వారా గ్రూప్ స్టేజ్‎లో ఓటమన్నదే ఎరగకుండా సగర్వంగా సూపర్ 8 రౌండ్‎కు దూసుకెళ్లింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్య ఛేధనకు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. శివమ్ దూబే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. 

అభి హ్యాట్రిక్ డకౌట్.. దూబే సిక్సర్ల వర్షం:

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. వరుసగా మూడో మ్యాచులోనూ డకౌటై తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి ఓవర్లలోనే ఆర్యన్ దత్ బౌలింగ్‎లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. 

పాకిస్తాన్‎పై వీరోచిత ఇన్సింగ్స్ ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా (18) త్వరగానే ఔట్ అయ్యాడు. ఆర్యన్ దత్ బౌలింగ్‏లో భారీ షాట్ ఆడబోయే క్రమంలో దురదృష్టవశాత్తూ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31) ఇన్నింగ్స్‎ను ముందుకు తీసుకెళ్లారు. 

తిలక్ ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన దూబే మొదట్లో ఆచితూచి ఆడాడు. చివర్లో గేర్ మార్చి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా కూడా సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు వికెట్లు తీశాడు. లోగాన్ వాన్ బీక్ మూడు వికెట్లు పడగొట్టాడు. కైల్ క్లైన్ ఒక వికెట్ సాధించాడు. 

పోరాడిన పసికూన:

194 పరుగుల భారీ లక్ష్యంతో ఛేధనకు దిగిన నెదర్లాండ్స్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. ఓపెనర్లు మైఖేల్ లెవిట్ (24), మాక్స్ ఓ'డౌడ్ (20) మంచి శుభారంభం అందించారు. బాస్ డి లీడే (30), కాలిన్ అకెర్మాన్ (23)  కూడా ఫర్వాలేదనిపించారు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‎తో ఒత్తిడి పెంచడంతో బంతులకు చేయాల్సిన పరుగులకు భారీ తేడా ఏర్పడింది. 

చివర్లో జాచ్ లయన్-కాచెట్ (26), నోహ్ క్రోస్ (25) మెరుపులు మెరిపించారు. లయన్-కాచెట, నోహ్ క్రోస్ చెలరేగి ఆడటంతో ఒకానొక దశలో భారత డౌగౌట్‎లో కొంచెం ఆందోళన నెలకొంది. కానీ చివరకు టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా.. శివమ్ దూబే రెండు వికెట్లు సాధించాడు. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు.