న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఆ హామీని ఉల్లంఘిస్తూ బిహార్, బెంగాల్, ఢిల్లీల్లో వందలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆరోపించింది. నిరసనకారులకు సాయం అందిస్తున్న వాలంటీర్లను కూడా అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని మండిపడింది.
ప్రభుత్వం వెంటనే విద్యార్థులను విడుదల చేయాలని.. కేసులు ఉపసంహరించుకోకపోతే ఢిల్లీ పోలీసులపై తామే స్వయంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. రాతపూర్వక హామీలను ఉల్లంఘిస్తే దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం సీజేపీ నేత అశుతోష్ రాంకా తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. హామీ ప్రకారం స్టూడెంట్లపై పెట్టిన కేసులను మంగళవారం వెనక్కి తీసుకోకపోతే ఢిల్లీ పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని.. మళ్లీ ఆందోళన చేపడతామని పేర్కొన్నారు.
ప్రభుత్వాలకు అలవాటుగా మారింది
సీనియర్ అడ్వకేట్, ఎంపీ కపిల్ సిబల్‌తో కలిసి సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడారు. నిరసనలు ఆగిపోయాక విద్యార్థులను ఒంటరిని చేసి అక్రమ కేసుల్లో ఇరికించడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని విమర్శించారు. అందుకే, ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజు నుంచే విద్యార్థులకు న్యాయ, వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకున్న విద్యార్థులందరినీ విడిపించేందుకు తమ లీగల్ టీమ్ నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
