ఏరో ఇండియా ఎఫెక్ట్.. మాంసం విక్రయాలు బంద్..

ఏరో ఇండియా ఎఫెక్ట్..  మాంసం విక్రయాలు బంద్..

ఏరో ఇండియా 2023 ఎగ్జిబిషన్ నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలకం కీలక నిర్ణయం తీసుకుంది. యెలహంక ఎయిర్ బేస్ నుంచి 10 కి.మీ. పరిధిలో మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 17 వరకు బెంగళూరు యెలహంగా ఎయిర్ బేస్ లో 14వ ఏరో ఇండియా 2023 ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో 10 కి.మీ. పరిధిలో ఉన్న మాంసం, పౌల్ట్రీ, చేపల దుకాణాలను 20వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారు బీబీఎంపీ చట్టం 2020 ఇండియన్ సివిల్ ఏవియేషన్ యాక్ట్ 1937లోని సెక్షన్ 91 ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది. మాంసం షాపులు బ్యాన్ చేయడంపై బీబీఎంపీ క్లారిటీ ఇచ్చింది. బయటపడేసిన మాంసం వ్యర్థాలను తినేందుకు వచ్చే రాబందులు, పక్షులు..ఆకాశంలో ఎగిరే విమానాలను ఢీకొట్టే ప్రమాదం ఉందని అందుకే నిషేధం విధించినట్లు చెప్పింది.

కాగా ఢిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరిగే ఏరో ఇండియా 2023 ఎగ్జిబిషన్ ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షోగా పేరుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో మొదటి మూడు రోజులు వ్యాపారులను, చివరి రెండు రోజులు ప్రజలను అనుమతించనున్నారు. ఏరో ఇండియా వెబ్ సైట్ ప్రకారం.. మొత్తం 731మంది ఎగ్జిబిటర్లు నమోదు చేసుకోగా.. అందులో 633మంది భారతీయులు, 98మంది విదేశీయులు ఉన్నారు.