
- దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: డిప్యూటీ సీఎం భట్టి
- సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి తీసుకోవాలి
- ప్రభుత్వ, కోర్టు ఆదేశాలున్న ల్యాండ్స్ మినహా మిగతా వాటిని క్రమబద్ధీకరించాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇందు కోసం 33 జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక్కో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎల్ఆర్ఎస్ పై రివ్యూ చేశారు.
దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్లను క్రమబద్ధీకరించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ‘2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లే అవుట్ కు సంబంధించిన వాటికి దరఖాస్తుదారులు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించి, తమ డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లే అవుట్ స్థలాలకు సంబంధించి రూ.10 వేలు దరఖాస్తు ఫీజుగా చెల్లించారు. అందులో ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న ల్యాండ్స్మినహా మిగతా వాటిని పరిష్కరించాలి’ అని భట్టి అధికారులకు సూచించారు. కాగా, దాదాపు నాలుగేండ్లుగా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు క్లియర్ కావడం లేదు. వాటిని పరిష్కరిస్తే ప్రభుత్వానికి రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.