తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కేవలం నటనతోనే కాకుండా, తన సేవా గుణంతోనూ ముందుంటారు. దాదాపు మూడు దశాబ్దాలుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT) ద్వారా లక్షలాది మందికి రక్తాన్ని, వేలాది మందికి చూపును ప్రసాదించారు. ఇప్పుడు ఆయన తన సేవా ప్రస్థానంలో మరో అద్భుతమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా మెగాస్టార్ ప్రకటించిన 'విద్యాదాన' సంకల్పం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బ్లడ్ బ్యాంక్ నుండి..
1998లో రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యుల ఆర్తనాదాలు విని చిరంజీవి 'బ్లడ్ బ్యాంక్' స్థాపించారు. ఆనాడు ఆయన వేసిన చిన్న అడుగు, నేడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రక్త నిధిగా అవతరించింది. కేవలం ప్రాణాలు కాపాడటమే కాకుండా, ఐ బ్యాంక్ ద్వారా అంధత్వ నివారణకు కృషి చేశారు. కరోనా విపత్కర కాలంలో 'ఆక్సిజన్ బ్యాంక్స్' ఏర్పాటు చేసి వేల మందికి ఊపిరి పోశారు. అయితే, అక్కడితోనే తన బాధ్యత తీరిపోలేదని చిరంజీవి భావించారు.
సూర్య 'అగరం'స్ఫూర్తితో..
ఈ ఉగాది సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు నన్ను చూసి సూర్య స్ఫూర్తి పొంది సేవలోకి వచ్చానని చెప్పారు. కానీ, నేడు సూర్య నడుపుతున్న 'అగరం ఫౌండేషన్' చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను అని చిరంజీవి తెలిపారు. తమిళనాడులో వేలాది మంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తున్న సూర్య సేవా దృక్పథం తనను కదిలించిందని, అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ అక్షర యజ్ఞం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
పేదరికం చదువుకు అడ్డుకాకూడదు!
కేవలం ఫీజులు కట్టడమే కాకుండా, మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రపంచ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం అని చిరంజీవి తెలిపారు. ఒక్క బిడ్డ చదువుకుంటే ఆ కుటుంబం దారిద్య్రం నుండి బయటపడుతుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రామ్ చరణ్ పర్యవేక్షణలో ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. ఇప్పటికే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్‌ను ఆధునీకరించి, డిజిటల్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
►ALSO READ | సమంత ఉగాది పచ్చడి.. సుమ సెటైర్లు.. ‘మా ఇంటి బంగారం’ స్పెషల్ ప్రోమో వైరల్!
సినిమాల్లో రికార్డులు సృష్టించడం చిరంజీవికి అలవాటు, కానీ సమాజ సేవలో ఆయన సృష్టిస్తున్న ఇంపాక్ట్ అంతకు మించి ఉంటోంది. 'పద్మ విభూషణ్' గ్రహీతగా తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్న మెగాస్టార్, త్వరలోనే ఈ ఉచిత విద్యకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ప్రకటించనున్నారు. "అన్నయ్య వస్తున్నాడు.. అక్షరం తోడుగా" అంటూ అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
