కొత్త పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కొత్త పార్టీ పేరుపై గురువారం (మార్చి 19) ఢిల్లీ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కొత్త పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) ఢిల్లీ హైకోర్టు సూచించింది.
పార్టీ పేరు అంశంపై సాంకేతిక తప్పులను సరిదిద్ది మళ్ళీ ECI కి దరఖాస్తు పంపినట్లు కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు సూచనలతో కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది చెప్పారు.
కొత్త పార్టీ పేరుపై జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు కల్వకుంట్ల కవిత. దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో నమోదు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని మరోసారి కోర్టును ఆశ్రయించారు. పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద పార్టీ నమోదుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గురువారం (మార్చి 19) ఢిల్లీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
