కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ హత్యాచార బాధితురాలి తల్లి రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు. త్వరలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరుఫున పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.
గురువారం (మార్చి 19) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో తన పేరు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా కాలం క్రితమే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని.. కానీ అప్పుడు రాజకీయాలపై తనకు ఆసక్తి లేదు మానసికంగా కూడా సిద్ధంగా లేనని చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడం, మహిళాలపై అఘాయిత్యాలు పెరిగిపోవడం, హోం మంత్రిగా మమతా బెనర్జీ విఫలం కావడంతో టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో పోటీ చేసేందుకు అంగీకరించానని తెలిపారు. తన కూతురి కేసులో నిందితులను తప్పించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుందని.. విచారణ నిష్పాక్షపాతంగా జరగడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. నా కుమార్తెకు న్యాయం జరిగేలా చూడటానికి.. ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని స్పష్టం చేశారు.
కాగా, మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 23 తొలి దశ, ఏప్రిల్ 29న సెకండ్ ఫేజ్ పోలింగ్‌జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఎంసీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మురం చేసింది. బీజేపీ తొలి దశలో భాగంగా 144 స్థానాలకు అభ్యర్థులను పేర్లు ప్రకటించింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
ఆర్జీకర్ కేసు:
2024, ఆగస్ట్ 9వ తేదీన ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలు అత్యంత పాశవికంగా హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి అదే ఆసుపత్రిలో గార్డ్‌గా పని చేసే సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అతడే జూడాపై అత్యాచారం చేసి హత్య చేశాడని కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యా్ప్తంగా దుమారం రేపడంతో కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. పోలీసులు, సీబీఐ అధికారులు ఇద్దరూ.. నిందితుడు సంజయే అని తేల్చారు.
