కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యువతుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జిల్లానుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా అమ్మాయిలను రవాణా చేస్తున్నారు. పెళ్లి, డబ్బు, ఉపాధి ఆశజూపి ఆసిఫాబాద్ జిల్లానుంచి యువతులను మధ్యప్రదేశ్ తరలిస్తున్న ముఠాకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ లో అమ్మాయిల అమ్మకాల దందా గురువారం(మార్చి19) బయటపడింది. బెజ్జూర్ నుంచి ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లి మధ్యప్రదేశ్ లో అమ్ముతున్న ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అమ్మాయిలను తరలిస్తుండగా మంచిర్యాల , మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
గత కొంతకాలంగా బెజ్జూర్ లో అమ్మాయిల అక్రమ రవాణా సాగుతోంది. కొంతమంది ముఠాగా ఏర్పడి అమ్మాయిలను కొనుగోలు చేసి మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్రమంగా అమ్మాయిలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.ఒక్కో అమ్మాయికి రూ. 2.50లక్షలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
మారుమూల ప్రాంతాల్లోని గిరిజన వర్గాలకు చెందిన అమాయక యువతులు, ఒంటరి మహిళలు, వితంతువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారిని వ్యభిచార గృహాలకు తరలించడంతో పాటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ వంటి ఉత్తర రాష్ట్రాల్లోని ఉన్నత కుటుంబాలకు చెందిన పురుషులతో బలవంతంగా వివాహం చేస్తున్నారు. ఈ కార్యకలాపాల ద్వారా నేరగాళ్లు త్వరితగతిన డబ్బు సంపాదిస్తున్నారు అని పోలీసులు చెబుతున్నారు.
