రామగుండం కార్మికుల హక్కులు కాపాడండి.. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వండి: ఎన్టీపీసీ ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 రామగుండం కార్మికుల హక్కులు కాపాడండి.. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వండి: ఎన్టీపీసీ ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం (ఆగస్టు 04) ఎన్టీపీసీ ఛైర్మన్ గుర్దీప్ సింగ్ తో భేటీ అయ్యారు. రామగుండం ప్రాంత కార్మికుల సమస్యల పరిష్కారం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గ్రేడ్-బి రేటింగ్ కల్పించి న్యాయమైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంట్రాక్ట్ కార్మికులకు అవసరమైన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జారీ చేసే విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈఎస్ఐ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదనపు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.

అదేవిధంగా ఎన్టీపీసీలో నిర్మాణంలో ఉన్న 800×3 మెగావాట్ల సూపర్ థర్మల్ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకే మొదటి ప్రాధాన్యం కల్పించాలని కోరారు. స్థానికులకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరారు.