మహారాష్ట్రలో ఘోరం: సన్‎రైజ్ చూసేందుకు వెళ్లి ముగ్గురు IIT బాంబే స్టూడెంట్స్ మృతి

మహారాష్ట్రలో ఘోరం: సన్‎రైజ్ చూసేందుకు వెళ్లి ముగ్గురు IIT బాంబే స్టూడెంట్స్ మృతి

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలా సమీపంలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై కారు ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబేకు చెందిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. మృతులను నాసిక్‌కు చెందిన ఓంకుమార్ బోర్సే (23), నాగ్‌పూర్‌కు చెందిన లే (20), జైపూర్‌కు చెందిన శ్రేయాంశ్ శర్మ (22) గా గుర్తించారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యోదయాన్ని వీక్షించేందుకు పవాయ్‌లోని ఐఐటీ బాంబే క్యాంపస్ నుంచి గురువారం (మార్చి 19) ఉదయం 5 గంటల ప్రాంతంలో ఓంకుమార్ బోర్సే, లే, శ్రేయాంశ్ శర్మ ముగ్గురు కారులో ఖండాలాకు బయలుదేరారు. ఖండాలా నుంచి ముంబై తిరిగి వస్తుండగా లోనావాలా సమీపంలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వీరు ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు.

►ALSO READ | పిచ్చి పీక్స్కు చేరడం అంటే ఇదే.. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వీళ్ల యేషాలు చూడండి !

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడం, ఘటన స్థలంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతి వేగం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద ఇన్స్టిట్యూట్‎లో చదువుతున్న తమ పిల్లలు భవిష్యత్‎లో మంచి ఉద్యోగం సంపాదిస్తారని కలల కన్న తల్లిదండ్రులు ఇలా మధ్యలోనే చేతికి అందిన బిడ్డలు విగతజీవులుగా మారడం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.