Mohan Babu : 'శికంజా మాలిక్'గా మోహన్ బాబు విధ్వంసం.. నాని 'ది ప్యారడైజ్' నుంచి గ్లింప్స్ రిలీజ్!.

Mohan Babu : 'శికంజా మాలిక్'గా మోహన్ బాబు విధ్వంసం.. నాని 'ది ప్యారడైజ్' నుంచి  గ్లింప్స్ రిలీజ్!.

టాలీవుడ్ లో 'డైలాగ్ కింగ్', 'కలెక్షన్ కింగ్'గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని  సొంతం చేసుకున్న నటుడు మంచు మోహన్ బాబు. ఈ రోజు(మార్చి 19) ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మారుస్తూ, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) నుండి చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ వీడియోను విడుదల చేసింది.

32 ఏళ్ల నిరీక్షణకు తెర.. 

'దసరా' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మోహన్ బాబు ఒక అత్యంత క్రూరమైన, డార్క్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన పూర్తిస్థాయి నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 46 సెకన్ల గ్లింప్స్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.దర్శకుడు శ్రీకాంత్ నన్ను మాయ చేశాడు. అందుకే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విలన్‌గా చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘శికంజా మాలిక్’ గా.. 

ఈ చిత్రంలో మోహన్ బాబు పోషిస్తున్న పాత్ర పేరు ‘శికంజా మాలిక్’ (Shikanja Maalik). ఈ పాత్ర కోసం ఆయనను సిద్ధం చేస్తున్న తీరు, మేకప్, ఆ గంభీరమైన వాయిస్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ వీడియో చివర్లో ఇచ్చిన ఎలివేషన్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ జనరేషన్‌కు మోహన్ బాబు సర్ అంటే ఎవరో సరిగ్గా తెలియకపోవచ్చు.. కానీ 'ప్యారడైజ్' సినిమాతో ఆయన అసలు సిసలు విశ్వరూపం ఏంటో చూపిస్తాం అని శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.

 గ్లోబల్ రిలీజ్!

రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో పెద్ద ప్లస్ పాయింట్. ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా, స్పానిష్, ఇంగ్లీష్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుండటం గమనార్హం. నాని పవర్‌ఫుల్ యాక్షన్, మోహన్ బాబు క్రూరమైన విలనిజం మధ్య సాగే ఈ పోరాటం ఆగస్టు 21, 2026న వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఒకప్పటి విలక్షణ విలన్‌గా మెప్పించిన మోహన్ బాబు, నేటి తరం మేకింగ్ విలువలతో ‘శికంజా మాలిక్’గా ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.