చిక్కుల్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

 చిక్కుల్లో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ పదవీకాలానికి ముందే ఇంపీచ్​మెంట్​కి గురయ్యేలా ఉన్నారు. యూఎస్​ కాంగ్రెస్​లోని డెమొక్రట్​ ప్రతినిధులు ఈ మేరకు ఇంపీచ్​మెంట్​ ఎంక్వయిరీని ఓపెన్​ చేశారు. ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​ స్కీపై ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరోపణలపై ఇప్పటికే ఆరు కమిటీలు రంగంలో దిగాయి. ట్రంప్​ చేసిన ఫోన్​కాల్స్​ గురించి ఒక విజిల్​ బ్లోయర్​ ఆరోపించారు. మాజీ వైస్​ ప్రెసిడెంట్​ జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ బిజినెస్ వ్యవహారాలపై  దర్యాప్తు జరిపించకపోతే ఉక్రెయిన్​కి అందిస్తున్న  సైనిక సాయాన్ని ఆపివేస్తామని ట్రంప్ బెదిరించినట్లుగా వచ్చిన వార్తలపై ఓ కమిటీ ఈ నెలలోనే విచారణ మొదలెట్టింది. వచ్చే ప్రెసిడెంట్​ ఎన్నికల్లో డెమొక్రట్ల తరఫున జో బిడెన్​ నిలబడనున్నారు. ఈ ఎన్నికల్లో బలమైన కేండిడేట్​ ఆయనే కాగలడని, ట్రంప్​ మళ్లీ గెలవడం కష్టమని అక్కడి పోల్​ ఎనలిస్టులు చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థిని బద్నాం చేయడానికి వేరే దేశం ప్రెసిడెంట్​పై ఒత్తిడి తీసుకురావడం కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని డెమొక్రట్లు మండిపడుతున్నారు. ఈ పని చేసినందుకు చట్ట ప్రకారం ట్రంప్​ను సెనేట్ వేదికగా నిలదీయవచ్చని అంటున్నారు. ‘ఇది కూడా అవినీతి లాంటిదే.  భవిష్యత్తులో అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ట్రంప్ వ్యవహరించారు’ అని డెమొక్రటిక్ పార్టీ సీనియర్ లీడర్ అడమ్ షిఫ్  విమర్శించారు.

ట్రంప్​ ఇంపీచ్​మెంట్​కి సంబంధించి రాజ్యాంగ నిబంధనలను జ్యుడీషియరీ కమిటీ పరిశీలిస్తోంది. ఉక్రెయిన్​ ఆరోపణలనుకూడా పరిగణనలోకి తీసుకోవాలని హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​ స్పీకర్​ నాన్సీ పెలోసి, ఇతర టాప్​ డెమొక్రట్లు భావిస్తున్నారు. అమెరికాలో అధ్యక్షుడిని ఇంపీచ్​ చేయాలంటే రెండంచెల ప్రాసెస్​ జరుగుతుంది. రిప్రజెంటేటివ్స్​ సభలో ఇంపీచ్​మెంట్​ ప్రొసీడింగ్స్​ ఆరంభిస్తుంది. సెనేట్​లో విచారణ జరుగుతుంది. ఇంపీచ్​మెంట్​ ఆర్టికల్స్​ ప్రకారంగా ఓటింగ్​ జరిగితే, సింపుల్​ మెజారిటీకంటే తక్కువ ఓట్లు వస్తే వీగిపోయినట్టవుతుంది. ఒకవేళ మెజారిటీ ఓట్లు గనుక ఇంపీచ్​మెంట్​కి అనుకూలంగా వచ్చినట్లయితే, ప్రెసిడెంట్​పై సెనేట్​లో విచారణ జరుగుతుంది.

జో బిడెన్ పై అసలు ఆరోపణలేంటి?

ఇది ఇప్పటి ఇష్యూ కాదు. 2016 లో  జో బిడెన్, అమెరికా  వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పటి ఉక్రెయిన్  ప్రెసిడెంట్ తో మాట్లాడుతూ అక్కడి అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉక్రెయిన్ లో అవినీతికి ఎండ్ కార్డ్ వేయాలంటే చేయాల్సిన  అనేక పనులను ఆయన ప్రస్తావించారు.అయితే  హంటర్ బోర్డు సభ్యుడిగా ఉన్న ‘ బురిస్మా హోల్డింగ్స్ ’ అనే ఆయిల్ కంపెనీకి సంబంధించి అక్రమాలు  జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై  దర్యాప్తు జరిపే కమిషన్ కు షోకిన్ అనే అధికారి చీఫ్ గా ఉన్నారు. జో ఇచ్చిన జాబితాలో  షోకిన్ ను పక్కన పెట్టే అంశం కూడా ఉంది. దీంతో ఈ విషయాన్నే  ట్రంప్ పట్టుకున్నారు.హంటర్ చేసిన అక్రమాలు బయటపడకుండా ఉండటానికే అనేక అంశాల్లో ,  షోకిన్ అనే అధికారిని  పక్కన పెట్టడం కూడా ఉందన్నది  ట్రంప్ అనుమానం. వైస్ ప్రెసిడెంట్ హోదాను అడ్డం పెట్టుకుని కొడుకు ను రక్షించుకోవడానకి  బిడెన్ ప్రయత్నించాడన్నది ట్రంప్ వాదనగా కనిపిస్తోంది. దీనినే ఇష్యూ  ఇప్పుడు  మెయిన్ ఇష్యూ  చేస్తున్నారు.

ట్రంప్​ ఏమంటున్నారు?

ఈ ఆరోపణలను ట్రంప్​ కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల్లో సాయంచేయాలంటూ తాను ఎవరినీ కోరలేదని తేల్చిచెప్పారు. తానేమీ తప్పుచేయలేదన్నారు. ఉక్రెయిన్​కు అందించే సాయాన్ని ఆపేయాలన్న నిర్ణయం తను వ్యక్తిగతంగా తీసుకున్నదేనని ఒప్పుకున్నారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్‌‌పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది. మరోవైపు ఈ విజిల్​బ్లోయెర్​ ఎవరనేది తనకు తెలియాలని ట్రంప్​ పట్టుదలగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన సంఘటన బయటికి రావడమంటే అది గూఢచర్యం కిందికే వస్తుందని ట్రంప్​ అన్నారని న్యూయార్క్​టైమ్స్​ కథనం ప్రచురించింది.

ఫిర్యాదులో ఏముంది?

రానున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌‌ పార్టీ తరఫున తన ప్రత్యర్థి కానున్న జో బిడెన్, ఆయన కుమారుడు హంటర్‌‌ బిడెన్‌‌ ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్‌‌ అధ్యక్షుడు వలొదిమిర్‌‌ జెలెన్‌‌స్కీపై డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ ఒత్తిడి తీసుకు వచ్చిన వివరాలను ఆ ఫిర్యాదులో పొందుపర్చారు.