అమెరికా – మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే అక్రమవలసల్ని అడ్డుకునేందుకు అమెరికా – మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం చేపడతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే గోడ నిర్మాణానికి అవసరమైన నిధులకు కాంగ్రెస్ మద్దతు అవసరం కావడంతో..ట్రంప్ లక్ష్యానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.
తాజాగా వైట్ హౌజ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సరిహద్దుగోడ నిర్మాణంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
నీటితో నిండిన కందకాల్లో పాములు ,మొసళ్లతో పహారా..
అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ, వైట్ హౌస్ సలహాదారులతో ఓవల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అక్రమ వలసల్ని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ట్రంప్ సలహా అడిగినట్లు టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
దీంతో పాటు అమెరికా సరిహద్దుల్లో వలసకు ప్రయత్నించే వారిని అడ్డుకునేందుకు అత్యంత ప్రమాద కరమైన విద్యుత్ వలయాలతో భారీ ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం, అమెరికా – మెక్సికోల మధ్య 2 వేల కిలోమీటర్ల మేర రాకపోకల్ని నిలివేయడం, ఎవరైనా సరిహద్దుల్ని దాటేందుకు ప్రయత్నిస్తే వారిపై కాల్పులు జరపడం, నీటితో నిండిన కందకాల్లో పాములు , మొసళ్లతో పహార వంటి చర్యలకు పాల్పడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ అభిప్రాయాన్ని ఏకీభవించని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపీ .. మెక్సికోతో అమెరికాకు ఉన్న వ్యాపార సంబంధాలు కొనసాగాలంటే సున్నితంగా వ్యవహరించాలని చెప్పారు.