నాంపల్లిలో బోగస్​ ఓట్లు.. ఈసీకి ఫిర్యాదు

నాంపల్లిలో బోగస్​ ఓట్లు.. ఈసీకి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని నాంపల్లి నియోజకవర్గంలో బోగస్​ ఓట్లు ఉన్నాయని, వాటిపై విచారణ చేసి వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్​ను కాంగ్రెస్​ నేతలు కోరారు. బుధవారం పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ నిరంజన్​, ఖైరతాబాద్​ డీసీసీ అధ్యక్షుడు, నాంపల్లి ఇన్​చార్జ్​ ఫిరోజ్​ఖాన్​, పార్టీ ఫిషర్​మెన్​ కమిటీ చైర్మన్​ మెట్టు సాయి తదితరులు సీఈవోకు కంప్లైంట్​ చేశారు. ఈ సెగ్మెంట్​లో దాదాపు లక్ష బోగస్​ ఓట్లు ఉన్నాయని ఫిరోజ్​ ఖాన్​ ఆరోపించారు. ఇండ్లు లేకపోయినా ఓట్లు ఉన్నాయని అన్నారు. చనిపోయినోళ్ల పేర్లూ లిస్ట్ లో​ఉన్నాయన్నారు. ఎంఐఎం, బీఆర్​ఎస్​ పార్టీల ఒత్తిడితోనే ఆ​ఓట్లను తొలగించడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీ ఆ బోగస్​ ఓట్లతోనే గెలుస్తున్నదని ఆయన మండిపడ్డారు. 

పాతబస్తీలో తప్ప ముస్లింలు ఎక్కువగా ఉన్న మిగతా ప్రాంతాల్లో ఎంఐఎం ఎందుకు గెలవడం లేదని ప్రశ్నించారు. అలాగే, హైదరాబాద్​ లోక్​సభ నియోజకవర్గంలోనూ 6 లక్షల నుంచి 7 లక్షల బోగస్​ ఓట్లున్నాయని ఆయన ఆరోపించారు. అవే లేకపోతే అసదుద్దీన్​ ఒవైసీ, అక్బరుద్దీన్​ ఒవైసీ గెలవరని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్లపై కాంగ్రెస్​ శ్రేణులు దృష్టి పెట్టాలని రోహిన్​ రెడ్డి కోరారు. నాంపల్లి సెగ్మెంట్​లో 273 పోలింగ్​ బూత్స్,​ ఉంటే కేవలం 130 మంది బీఎల్​వోలే ఉన్నారన్నారు.