ఎనిమిదేండ్లయినా నెరవేర్చరాయె

ఎనిమిదేండ్లయినా నెరవేర్చరాయె

వరంగల్, వెలుగు: ‘తెలంగాణ ఉద్యమం అనగానే  నెలల తరబడి ఆటోలు పక్కన బెట్టిన్రు.. సకల జనుల సమ్మె అనగానే వేలాదిగా సైరన్ మోగించిన్రు.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నరు.. ఈ  క్రమంలో  ‘‘ఆత్మగౌరవం కోసం ఆటో స్టీరింగ్ పట్టుకున్న డ్రైవరన్నలకు కొత్త రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. రూ.1,000 కోట్ల బడ్జెట్‍ కేటాయిస్తాం” అని నాటి ఉద్యమ లీడర్లు హామీ ఇవ్వగానే రాష్ట్రంలోని లక్షలాది మంది డ్రైవర్లు మస్తు ఖుషీ అయ్యారు. తీరా తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు దాటినా.. హామీ అమలు చేయలేదు. కానీ కరోనా ఎఫెక్ట్​, ఫైనాన్సర్ల దెబ్బకు గుంతల రోడ్లపై జర్నీ లెక్క ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ‘ఆటో బంధు’ స్కీం అయినా తెచ్చి తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్​ చేస్తున్నారు.

రాష్ట్రంలో 6 లక్షలు.. ఓరుగల్లులో 50 వేలు..

రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది మే నాటికి  ప్యాసింజర్ ఆటోల సంఖ్య 4,41,903. ఇప్పుడవి దాదాపు 5 లక్షలకు పెరిగాయి. ఆటోలపై దాదాపు 6 లక్షల మంది డ్రైవర్లు ఉండగా, ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో 50 వేల వరకు ఉన్నారు. రాష్ట్రంలో నోటిఫికేషన్లు లేక ఉద్యోగావకాశాలు పీజీలు, డిగ్రీలు చేసిన యువత కూడా  ఆటో డ్రైవర్‍ వృత్తిని నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.  మారుమూల పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి కిరాయి ఇండ్లల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. 

హామీ నెరవేర్చలే..

‘ప్రపంచ ఆటో డ్రైవర్స్​ దినోత్సవం’ సందర్భంగా వరంగల్లో ఏటా ఆగస్టు1న వేలాది మంది డ్రైవర్లతో మహాసభలు నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ఒక్కో ఏడాది ఒక్కో మంత్రి గెస్టుగా 
హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో అన్నీ తానై ముందుకుసాగిన ప్రస్తుత మంత్రి హరీశ్​రావు, డిప్యూటీ సీఎంలు  కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఎంతో మంది ప్రస్తుతం అధికారంలో ఉన్న చాలా మంది లీడర్లు  ‘ప్రత్యేక ఆటో కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తామని.. రూ.1000 కోట్లు కేటాయిస్తామని హామీలిచ్చారు. తెలంగాణ వచ్చి 8 ఏండ్లు దాటినా హామీని అమలు చేయట్లేదు.

ఆటో కార్మికులతో.. రూ.5 వేల కోట్ల లాభం

రాష్ట్రంలోని ఆటోలు వాడే డీజిల్‍ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తోందని యూనియన్లు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 6 లక్షల ఆటోలు సగటున రోజూ4 లీటర్ల డీజిల్‍ ఉపయోగించినా..  24 లక్షల లీటర్ల డీజిల్‍ అమ్మకాలు సాగుతున్నాయి. ఇందులో లీటర్‍పై రూ.50 నుంచి 60 రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  టాక్స్​ రూపంలో రోజుకు  రూ.13 కోట్లు గవర్నమెంట్‍కు ఇన్‍కమ్‍ వస్తోంది. ఏడాదిలో 300 రోజులకు లెక్కించినా.. ఏటా 4 వేల కోట్లు  ప్రభుత్వాల ఖాతాలోకి వెళుతున్నాయి. ఇవేగాక రిజిస్ట్రేషన్‍ ఛార్జీలు, ఇన్సూరెన్సులు, ఆర్టీఏ, పోలీసుల ఫైన్ల ద్వారా మరో వెయ్యి కోట్లు వేసుకున్నా.. ఆటో డ్రైవర్ల ద్వారా ప్రభుత్వాలకు ఏటా రూ. 5 వేల కోట్ల లాభం చేకూరుతోంది.

కరోనా.. ఫైనాన్సర్లతో చితికిన బతుకులు

యావత్​ ప్రపంచాన్నే వణికించిన కరోనా ఆటోడ్రైవర్ల  జీవితాలను మరింత దుర్భరం చేసింది. లాక్​డౌన్ ​కారణంగా ఆటోలు రోడ్డెక్కలేదు. డ్రైవర్లు స్టీరింగ్‍ ముట్టలేదు. ఫ్యామిలీ గడవడానికే కష్టంగా ఉండగా.. ఆటో ఫైనాన్సర్లు వీరిని మరింత ఇబ్బంది పెట్టారు. నెలనెల కిస్తీలు కట్టడానికి డ్రైవర్లు మళ్లీ అప్పులు చేశారు. కట్టనివారి ఆటోలను ఫైనాన్సర్లు బలవంతంగా గుంజుకెళ్లారు. గతంలో ఏడాదికి రూ.2 వేలు ఉండే ఇన్సూరెన్స్ ఇప్పుడు రూ.10 వేలకు చేరింది. డీజిల్‍ రేటు ఒక్కసారిగా పెరగడంతో రాత్రి, పగలు ఆటోలు నడిపినా బతుకులు భారంగానే నడుస్తున్నాయి. 

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలె

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీల ప్రకారం.. రూ.1,000 కోట్లతో ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. టాక్స్​ల రూపంలో వచ్చే ఆదాయం నుంచి  డ్రైవర్ల సంక్షేమం కోసం కొంత కేటాయించాలి.  ఇప్పటికే ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‍ ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లను ఆర్థికంగా చేయూత అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దళితబంధు తరహాలోనే ‘ఆటోబంధు’ స్కీం తీసుకురావాలి.

- గుడిమల్ల రవికుమార్, తెలంగాణ ఆటో డ్రైవర్స్​యూనియన్‍ రాష్ట్ర అధ్యక్షుడు