‘పుష్ప’ మ్యానరిజంతో కనిపించిన మేవానీ

‘పుష్ప’ మ్యానరిజంతో కనిపించిన మేవానీ

గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మేవానీని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ‘ఇన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ భారత మువ్వన్నెల జెండాను ఏనాడు ఎగరేయలేదని, మోడీ గాడ్సే భక్తుడు’ అంటూ జిగ్నేష్ మేవానీ గతంలో తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టారనే కారణం చూపుతూ అస్సాం పోలీసులు మేవానీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన మేవానీకి... సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎస్కార్ట్ గా ఉన్న ఓ మహిళా పోలీసుపై మేవానీ అసభ్యకరంగా ప్రవర్తించారనే అభియోగంతో ఆయనను అస్సాం పోలీసులు ఈ రోజు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను వాహనంలో తీసుకెళ్తున్న క్రమంలో ... మేవానీ పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మ్యానరిజంతో కనిపించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా ‘తగ్గేదే లే’ అంటూ బదులిచ్చారు.

మహిళా కానిస్టేబుల్ తో మేవానీ అసభ్యంగా ప్రవర్తించలేదని, కావాలనే ఆయనపై కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారని మేవానీ తరఫు  లాయర్ తెలిపారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్ తన జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాయని, అయితే వాటి బెదిరింపులకు భయపడేదిలేదని మేవానీ గతంలో ప్రకటించారు. తాజాగా తనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో పుష్ప మూవీలో అల్లు అర్జున్ మ్యానరిజాన్ని అనుకరిస్తూ మేవానీ కనిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరిన్ని వార్తల కోసం...

ఎల్బీనగర్ టిమ్స్ కు భూమి పూజ చేసిన కేసీఆర్

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

వరంగల్ లో ‘జయమ్మ’ టీం సందడి