అరటిని అమ్ముడెట్లా !

అరటిని అమ్ముడెట్లా !
  • మార్కెటింగ్‌‌‌‌ లేక  రైతుల అవస్థలు
  • కొవిడ్ నుంచి నష్టాల బాటలోనే..
  • మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎగుమతి

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామం పేరు వినగానే అందరికీ హోలీ రోజు ఆడే పిడిగుద్దులాటే గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే అరటి సాగు. మహారాష్ట్ర, తెలంగాణకు బార్డర్‌‌‌‌‌‌‌‌ మంజీరా నది ఒడ్డున ఉండే ఈ ఊళ్లో ఇసుక నేలలు ఎక్కువ. వరి, చెరుకు, పప్పుదినుసులతో పాటు అరటి కూడా ప్రధాన పంటగా సాగు చేస్తారు. 25 ఏళ్లుగా రైతులు ఇక్కడ అరటి తోటలను సక్సెస్‌‌‌‌ ఫుల్‌‌‌‌గా సాగు చేస్తున్నారు. ఈసారి హున్సాలో దాదాపు 200 ఎకరాల్లో అరటి సాగైంది. 

తప్పని నష్టం...

12 నుంచి 15 నెలల సమయంలో అరటి క్రాప్‌‌‌‌ వస్తుంది. ఈసారి జిల్లాలో దిగుబడి పెరిగింది. దీంతో రేటు పడిపోయింది. పండ్ల రకాన్ని బట్టి క్వింటాల్‌‌‌‌కు ప్రస్తుతం రూ.600 నుంచి రూ.1,200 ధర పలుకుతోంది. అయితే జిల్లాలో అరటి మార్కెటింగ్ సౌకర్యం లేదు. దీంతో రైతులు పండ్లను ఇక్కడి నుంచి మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలకు తరలించి అక్కడ అమ్ముకుంటున్నారు. ఫలితంగా రవాణా చార్జీలు మీద పడి నష్టం తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించి రూ.1,500 నుంచి రూ.1,800  ధర కల్పించాలని అరటి రైతులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. 

రెండేళ్లుగా లాస్‌‌‌‌లోనే..

కోవిడ్ కారణంగా అరటి రైతులు రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయారు. ఎకరానికి సుమారు రూ.70 వేలు ఖర్చవుతోంది. మార్కెట్ లేకపోవడంతో ఈ సారి సాగు విస్తీర్ణం కొంత తగ్గింది. ఈసారి దిగుబడి బాగానే ఉన్నా రేటు లేక ఒక్కో రైతు సుమారు రూ.2 లక్షలు నష్టపోయారు. హున్సా అరటి రైతులు సుమారు రూ.కోటి వరకు నష్టపోయినట్టు చెబుతున్నారు.  

హున్సా గ్రామంలో  200 మంది రైతుల పరిస్థితి..

హున్సా గ్రామానికి చెందిన సింగారి సాయిలు ఐదు ఎకరాల్లో అరటి తోట వేశాడు. ఎకరానికి రూ.70 వేలు ఖర్చు చేశాడు. ఎకరానికి 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెటింగ్‌‌‌‌ సౌకర్యం లేకపోవడంతో బ్రోకర్లకు రూ.1,200 క్వింటాల్‌‌‌‌ చొప్పున అమ్ముకోగా ఎకారానికి రూ.72,000 వచ్చింది. దాదాపు 15 నెలలు కష్టపడిన ఆయనకు మిగిలింది రూ.2 వేలే.. ఇది ఒక్క సాయిలే కాదు.. గ్రామంలోని 200 మంది రైతుల పరిస్థితి ఇదే...

మార్కెట్ సౌకర్యం కల్పించాలి

జిల్లాలో అరటికి మార్కెటింగ్‌‌‌‌ సౌకర్యం లేదు. పంటను కొనే బ్రోకర్లు తక్కువ రేటు ఇస్తున్నారు. వేరే ప్రాంతానికి తరలించి అమ్ముకుందామంటే రవాణా చార్జీలు మీద పడుతున్నాయి. ప్రభుత్వం అన్ని పంటల్లాగే అరటికి కూడా సబ్సిడీ విత్తనాలతో పాటుగా మార్కెటింగ్‌‌‌‌ సౌకర్యం కల్పించాలి.  

 - డి.స్వామి, అరటి రైతు

మార్కెటింగ్‌‌‌‌కు చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని మంజీరా, గోదావరి తీర ప్రాంతాల్లో పండ్ల తోటలకు అవకాశం ఉంది. అరటి సాగు చేస్తున్న రైతులకు సీడ్‌‌‌‌ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి నివేదిస్తాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.

- తిర్మల్ ప్రసాద్, జేడీ అగ్రికల్చర్​