6 నిమిషాలు..2 బాల్స్‌.. 0 రన్స్‌

6 నిమిషాలు..2 బాల్స్‌.. 0 రన్స్‌
  •  ఓపెనర్ గా రోహిత్ ఫెయిల్
  • సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్ డ్రా

విజయనగరం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ డ్రాగా ముగిసింది. ఆంధ్ర వికెట్‌‌ కీపర్‌‌, బ్యాట్స్‌‌మన్‌‌ కోన భరత్‌‌ (57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 71), ప్రియాంక్‌‌ పాంచల్‌‌ (77 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 60), సిద్దేశ్‌‌ లాడ్‌‌ (89 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 52 నాటౌట్‌‌) హాఫ్‌‌ సెంచరీలతో చెలరేగడంతో.. శనివారం మూడో రోజు ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 64 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌ను 64 ఓవర్లలో 279/6 స్కోరు వద్ద డిక్లేర్‌‌ చేసింది. 199/5 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన బవ్యుమా (127 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 87 నాటౌట్‌‌), ఫిలాండర్‌‌ (49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 48) దుమ్మురేపారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌‌కు 80 పరుగులు జోడించారు.

రోహిత్‌‌ డకౌట్‌‌..

ఓపెనర్‌‌గా సక్సెస్‌‌ అవుతాడని భావించిన టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఆశలను రోహిత్‌‌ నెరవేర్చలేకపోయాడు. మయాంక్‌‌ అగర్వాల్‌‌ (39)తో కలిసి ఇన్నింగ్స్‌‌ ప్రారంభించిన ఈ ముంబైకర్‌‌.. బంతిని అంచనా వేయడంలో మళ్లీ అదే పొరపాట్లు చేశాడు. స్వింగ్‌‌ అవుతున్న బంతిని డిఫెన్స్‌‌ చేసే క్రమంలో  రెండో ఓవర్‌‌లోనే ఫిలాండర్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఫిలాండర్‌‌ వేసిన అద్భుతమైన ఔట్‌‌ స్వింగర్‌‌.. రోహిత్‌‌ బ్యాట్‌‌ను ముద్దాడుతూ కీపర్‌‌ క్లాసెన్‌‌ చేతిలోకి వెళ్లడంతో ఆరు నిమిషాల్లోనే పెవిలియన్‌‌ బాట పట్టాడు. వన్‌‌డౌన్‌‌లో అభిమన్యు ఈశ్వరన్‌‌ (13) కూడా నిరాశపర్చడంతో టీమిండియా 2 వికెట్లకు 23 రన్స్‌‌ చేసి కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన ప్రియాంక్‌‌ పాంచల్‌‌ నిలకడగా ఆడాడు. రబడ (1/27), ఫిలాండర్‌‌ (2/27) స్వింగ్‌‌తో బెంబేలెత్తించినా.. మయాంక్‌‌కు చక్కని సహకారం అందించాడు. మూడో వికెట్‌‌కు 62 రన్స్‌‌ జోడించి మయాంక్‌‌ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కరుణ్‌‌ నాయర్‌‌ (19) ఓ మాదిరిగా ఆడాడు. ఈ క్రమంలో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసిన ప్రియాంక్‌‌ నాలుగో వికెట్‌‌కు 49 రన్స్‌‌ జోడించి వెనుదిరిగాడు.  నాలుగు బంతుల తర్వాత కరుణ్‌‌ నాయర్‌‌ కూడా ఔట్‌‌ కావడంతో ఇండియా 136 రన్స్‌‌కే 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సిద్దేశ్‌‌ లాడ్‌‌, భరత్‌‌.. ప్రొటీస్‌‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఆరో వికెట్‌‌కు 100 రన్స్‌‌ జోడించడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌ తేరుకుంది.