పనిపేరుతో పిలిచి సుత్తితో దాడి.. నగల దోపిడీ

పనిపేరుతో పిలిచి సుత్తితో దాడి.. నగల దోపిడీ
  • మహిళా కూలీపై దాడి చేసిన మేస్త్రీ
  • అపస్మారక స్థితిలో రాత్రంతా గుట్టల్లోనే  మహిళ
  • గత నెల 23న షాహినాథ్ గంజ్ పీఎస్ పరిధిలో ఘటన
  • స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు
  • సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి అరెస్ట్

‘ పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళా కూలీని ఓ మేస్ట్రీ గుట్టల్లోకి తీసుకెళ్లాడు. బంగారం,వెండి నగల కోసం సుత్తితో ఆమె తలపై కొట్టి  హత్యాయత్నం చేశాడు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు.  సీసీ కెమెరాలను జల్లెడ పట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.’

హైదరాబాద్,వెలుగు: మహిళా కూలీకి పని ఇప్పిస్తానని చెప్పి హత్యాయత్నం,దోపిడికి పాల్పడిన దొంగ మేస్త్రీని సీసీ కెమెరాలు పట్టించాయి.  పథకం ప్రకారం ఆమెను గుట్టల్లోకి  తీసుకెళ్లి బంగారం,వెండి నగలను దొంగిలించిన తాపీ మేస్ట్రీని షాహినాయత్​ గంజ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు చోరీ చేసిన 5 గ్రాముల పుస్తెలతాడుతో పాటు 5 గ్రాముల బంగారు గుండ్లు, 33 తులాల కాళ్ల కడియాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో ఛేదించిన ఈ కేసు వివరాలను గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డితో కలిసి వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు.

బేగంబజార్ నుంచి పహాడీషరీఫ్ గుట్టల్లోకి..

మహబూబ్ నగర్ కి చెందిన ఎన్.ఇందిరమ్మ(38)ను భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జుమ్మేరాత్ బజార్ లో ఆమె ఉంటోంది. బేగంబజార్ లోని అడ్డా కూలీలతో కలిసి పనికి వెళ్లేది.  నాగర్ కర్నూల్ కు తెల్లపలుగుతండాకు చెందిన తాపీ మేస్త్రీ ఇస్లావత్ దశరథ్(45) కూడా ఇందిరమ్మ వచ్చే అడ్డా దగ్గరికే వచ్చేవాడు. ఇందిరమ్మ ఒంటిపై ఉన్న బంగారం,వెండి నగలను కొట్టేయాలని దశరథ్ స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో నవంబర్ 23న మధ్యాహ్నం ఇందిరమ్మకు పని ఇప్పిస్తానని చెప్పి పాతబస్తీ శివారు ప్రాంతంలోని పహడీషరీఫ్ తీసుకెళ్ళాడు. పహడీషరీఫ్ గుట్టల్లో రాళ్ళు పగుల గొడితే రూ.600ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్ళాడు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఆమె ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు,వెండి కాళ్ళ కడియాలు తీసి ఇవ్వాలని  దశరథ్​..ఇందిరమ్మను బెదిరించాడు.

23న రాత్రంతా గుట్టల్లోనే బాధితురాలు

దశరథ్ కు బంగారం,వెండి ఇవ్వడానికి బాధితురాలు నిరాకరించింది. దీంతో తన వద్ద ఉన్న సుత్తితో ఇందిరమ్మ తల ముఖంపై దశరథ్ దాడి చేశాడు. బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారు,వెండి ఆభరణాలను తీసుకుని పారిపోయాడు. ఈ దాడిలో ఇందిరమ్మ తల పగిలిపోయి తీవ్రంగా రక్తశ్రావం అయ్యింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 23న రాత్రి అంతా గుట్టల్లోనే పడిపోయి ఉంది. రాత్రి వరకు భార్య ఇంటికి రాకవడంతో ఆమె భర్త ఫకీరప్ప షాహినాయత్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేశాడు. ఈ క్రమంలో మరోసటి రోజు 24న ఉదయం తలపై గాయాలతో ఉన్న  ఇందిరమ్మ జుమ్మేరాత్ బజార్ లోని ఇంటికి చేరుకుంది. తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చిన ఇందిరమ్మను భర్త ఫకీరప్ప ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు లైట్ తీసుకోలేదు

ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇందిరమ్మ స్టేట్ మెంట్ ను షాహినాయత్ గంజ్ అడిషనల్ ఇన్ స్పెక్టర్ కె.మారుతి ప్రసాద్ రికార్డు చేశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో బేగంబజార్ కూలీల అడ్డా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను పోలీసులు చెక్ చేశారు. సుమారు 88 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లు పరిశీలించారు. ఆ రోజు ఇందిరమ్మను తీసుకెళ్ళిన దశరథ్ ఫుటేజ్ ను సేకరించారు. ఎంజీబీఎస్,చార్మినార్, పహడీషరీఫ్ పరిసర ప్రాంతాల్లోని ఆటో స్టాండ్స్ లోని సీసీఫుటేజ్ ఆధారంగా ఇందిరమ్మను తీసుకెళ్ళిన వ్యక్తి దశరథ్ ను గుర్తించారు. ఫొటో ఇమేజ్ తో 22 కూలీల అడ్డాల్లో 150 మందిని విచారించారు. మహబూబ్ నగర్ కి చెందిన ఓ మేస్త్రీ ఇచ్చిన సమాచారంతో దశరథ్ కదలికలపై నిఘా పెట్టారు. సోమవారం బేగంబజార్ లేబర్ అడ్డాకి వచ్చిన దశరథ్ ను అరెస్ట్ చేశారు. చోరీ చేసిన 5 గ్రాముల పుస్తెల తాడుతో పాటు 5 గ్రాముల గుండ్లు, 33 తులాల కాళ్ళ కడియాలు స్వాధీనం చేసుకున్నారు. తలపై బలమైన గాయాలైన ఇందిరమ్మను నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. నారాయణపేట్ ఎమ్మెల్యే సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరు చేయించి ఇందిరమ్మకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.