ప్రైవేట్ కాలేజీల సమస్యలు పరిష్కరిస్తం: మంత్రి శ్రీధర్ బాబు

ప్రైవేట్ కాలేజీల సమస్యలు పరిష్కరిస్తం:  మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి, కాంగ్రెస్​ జాతీయ మేనిఫెస్టో ప్రచార కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కోడ్ ముగిసిన అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం గాంధీ భవన్​లో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం(టీపీజేఎంఏ), తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం(టీపీడీఎంఏ) సభ్యులు సమావేశమయ్యారు. 

టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు  గౌరి సతీశ్, టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బాల క్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో  పీసీసీ మేధావుల ఫోరం చైర్మన్ శ్యాంమోహన్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ప్రొఫెసర్ జానయ్య, టీపీజేఎంఏ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మంత్రి శ్రీధర్ బాబుకు తమ సమస్యలను వివరించారు. విద్యారంగం గత తొమ్మిదేండ్లుగా ఎలాంటి సమీక్షలకు నోచుకోలేదని, ఎడ్యుకేషన్​ను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేసిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ.. వారి సమస్యలపై మేనిఫెస్టో కమిటీతో చర్చించి ప్రభుత్వపరంగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.