
- ఏడాది తిరక్కముందే 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: సీఎం
- నిరుద్యోగ యువత ఆందోళన చెందొద్దు.. మా వద్దకు వచ్చి మాట్లాడండి
- మంత్రులు రెడీ.. మీ అన్నగా నేనూ సిద్ధమే
- మాకు భేషజాలు లేవు.. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం
- గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నం
- ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్
హైదరాబాద్, వెలుగు : రాబోయే 90 రోజుల్లో మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెల్లలోనే 31వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 11వేల టీచర్ పోస్టులు, గ్రూప్-–1, గ్రూప్–-2, గ్రూప్–-3 ద్వారా పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 30వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం 483 మంది ఫైర్‌మెన్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అకాడమీలో 4 నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫైర్‌మెన్‌లకు దిశానిర్దేశం చేశారు. పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి సీఎంతోపాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, హోంశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, అధికారులు హాజరయ్యారు. పరేడ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి157మంది డ్రైవర్ ఆపరేటర్లకు నియామక పత్రాలు అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తం
తెలంగాణ ఏర్పాటుకోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోరాటాలు చేశారని, వారి ఆకాంక్షలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఎల్బీ స్టేడియంలో 90 రోజుల్లోనే 31వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం”అని వెల్లడించారు.
ప్రజా ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం
తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపడ మే తమ లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గురువారం రాష్ట్ర బడ్జెట్ ప్రవే శపెట్టామని, 2 లక్షల 91వేల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, ఉపాధికి ప్రయారిటీ ఇచ్చామని తెలిపారు. ‘‘రైతులకు సహాయం అందాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యాలు నిర్దేశించుకున్నం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి భట్టి ఆర్థిక నిబద్ధతను పాటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఫించన్ అందేలా చర్యలు తీసుకున్నాం” అని వివరించారు.
ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి
ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫైర్‌మెన్‌లకు సీఎం అభినందనలు తెలిపారు.ఫైర్‌మెన్ సర్వీస్ అనేది ఉద్యోగం కాదని.. సమాజానికి చేసే సేవ అని అభివ ర్ణించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తల్లి దండ్రులను, అక్కాచెల్లెళ్లను బాగా చూసుకోవాలని సూచించారు. యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాల్లోని తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని అన్నారు. అందుకే తాను ఈ సూచన చేస్తున్నట్టు తెలిపారు. యువకులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చిన అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి, ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగులను సీఎం అభినందించారు.
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ : మంత్రి శ్రీధర్‌బాబు
టీజీపీఎస్సీలో అనుభవజ్ఞులను నియమించి, ఉద్యోగాల నియమాక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రజలు, యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. ‘‘శిక్షణ పూర్తి చేసుకున్న ఫైర్‌మెన్‌లకు, అకాడమీ సిబ్బందికి అభినందనలు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడే బాధ్యత అగ్నిమాప శాఖ సిబ్బందిపై ఉంటుంది. ఫైర్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. రాష్ట్ర యువతకు తెలంగాణ అగ్నిమాపకశాఖలో ఉద్యోగాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు అన్నగా నేనున్నా..
నిరుద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘మా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతున్నది. ప్రజల ఆలోచనలు, సూచనలు అమలు చేసేందుకే మేమున్నాం. నిరుద్యోగ యువత, విద్యార్థులు కొంత మంది పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. కానీ, నిరుద్యోగులు నిరసనలు తెలపాల్సిన పనిలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. మీకు సమస్యలు, ఇబ్బందులు ఉంటే మంత్రులు, ఉన్నతాధికారులకు తెలపండి. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే.. వాటిని పరిష్కరించేందు కు ‘మీ రేవంత్ అన్న’గా ఎప్పుడూ మీపట్ల నిబద్ధతతో పనిచేస్తా’’అని సీఎం భరోసా ఇచ్చారు.