ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని ఓల్డ్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో 252 షాపులను శుక్రవారం కేఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ డ్రా పద్ధతిన వ్యాపారులకు కేటాయించారు. 197 షాపులకు రూ. 10 వేల చొప్పున, 49 ఆకుకూరల షాపులకు రూ.5 వేలు, ఆరుగురు దివ్యాంగులకు రూ.5 వేల చొప్పున కేఎంపీ పేరున డబ్బులు కట్టించుకున్నారు. షాపు రానివారికి ఈ డబ్బులు తిరిగి చెల్లిస్తారు.
ఇక డ్రాకు ముందు కేఎంసీ అధికారులు వ్యాపారులకు నిబంధనలను చదివి వినిపించారు.1 నుంచి 58 షాపుల వరకు రూ.5 వేల అద్దె,59 నుంచి 210 వరకు రూ.3 వేలు, ఆకుకూరల షాపు నిర్వాహకులు ప్రతినెలా రూ.15 వందల చొప్పున అద్దె చెల్లించాలని తెలిపారు. డ్రాలో షాపు దక్కించుకున్న వారు మూడు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకొని 3 నెలల అద్దె చెల్లించాలని నిబంధన విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే షాపుల నిర్వాహకులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు.
గతంలో షాపుల కేటాయింపు వాయిదా పడటంతో శుక్రవారం టౌన్ ఏసీపీ రమణ మూర్తి పర్యవేక్షణ లో ఇద్దరు సీఐలతో పోలీస్ బందోబస్తు నిర్వహించి శాంతియుత వాతావరణంలో కేఎంసీ అధికారులు వ్యాపారులకు షాపులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, మేనేజర్ జి.శ్రీనివాసరావు, ఆర్ ఓ లు సుధాకర్, వెంకట లక్ష్మి, టీఎంసీ జి.సుజాత, హార్టికల్చర్ ఆఫీసర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.
