PF News: జాబ్ పోయిందా..? పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఒకేసారి తీసుకోవచ్చో తెలుసా..?

PF News: జాబ్ పోయిందా..? పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఒకేసారి తీసుకోవచ్చో తెలుసా..?

PF Withdrawal Limits: పీఎఫ్ అనేది ఉద్యోగులకు అత్యంత భరోసానిచ్చే దీర్ఘకాలిక పొదుపు పథకం. అయితే ఉద్యోగం మారినప్పుడో లేదా అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడో పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును ఎలా విత్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఎంత మొత్తం తీసుకోవచ్చు? అనే విషయాలపై చాలామందికి స్పష్టత ఉండదు. పీఎఫ్ రూల్స్ ప్రకారం మీరు పూర్తిగా 58 ఏళ్ల వయస్సులో రిటైర్ అయినప్పుడు లేదా ఉద్యోగం వదిలేసిన తర్వాత రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఖాతాలోని పూర్తి బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఉద్యోగం పోయిన వెంటనే నిధులు అవసరమైతే.. ఈపీఎఫ్‌ఓ ఒక వెసులుబాటు కల్పిస్తోంది. ఒక నెల పాటు జాబ్ లేకుండా ఉన్నట్లయితే మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ లో 75 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని ఒక సంవత్సరం తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా ఖాతాలో 25 శాతం అమౌంట్ ఉంచడం వల్ల సభ్యత్వంతో పాటు వడ్డీ ప్రయోజనాలు కూడా కొనసాగుతాయి. ఈ విత్ డ్రాయల్ మొత్తంలో ఉద్యోగి వాటా, యజమాని వాటాతో పాటు అప్పటివరకు జమ అయిన వడ్డీ కూడా కలిసే ఉంటుంది.

పన్ను విషయానికి వస్తే.. ఐదేళ్ల నిరంతర సర్వీసు పూర్తి కాకముందే పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకుంటే అది పన్ను పరిధిలోకి వస్తుంది. యజమాని వాటా, వడ్డీపై టీడీఎస్ వర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసి, ఉద్యోగాలు మారిన ప్రతిసారీ పీఎఫ్ బదిలీ చేసుకుంటే మాత్రం ఆ విత్ డ్రాయల్ పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం వదిలేసి, పీఎఫ్ విత్ డ్రా చేసుకోకపోయినా.. మూడు సంవత్సరాల వరకు అకౌంట్లో ఉన్న డబ్బుపై వడ్డీ వస్తుంది.

ఇక పెన్షన్ విషయానికి వస్తే.. 10 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు ఉండి ఉద్యోగం వదిలేస్తే పెన్షన్ సొమ్మును ఒకేసారి తీసుకోవచ్చు. కానీ 10 ఏళ్లకు మించి సర్వీసు ఉంటే మాత్రం ఆ సొమ్మును మధ్యలో తీయడానికి వీల్లేదు. అలాంటి వారు 58 ఏళ్లు నిండిన తర్వాతే నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులవుతారు. కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు పాత పీఎఫ్ ఖాతాను UAN ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల సర్వీసు నిరంతరాయంగా కొనసాగడమే కాకుండా.. భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనాలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని జాబ్స్ మారినా ఒకటే యూఏఎన్ నంబర్ కంటిన్యూ చేయటం మంచిదనమాట.