మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   
  •     మున్సిపాలిటీల అభివృద్ధికి 
  •     భారీగా నిధులు కేటాయించాం
  •     పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజలను కోరారు. మంగళవారం మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో సమగ్ర ప్రణాళికలతో మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామన్నారు.

నగరాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు పేదలు, బడుగు-బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేసి.. ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం కోటీ 15 లక్షల కుటుంబాలు ఉండగా, దాదాపు కోటీ 3 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. 200 యూనిట్లలోపు పేదలకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీని ద్వారా వారి జీవనోపాధి ఖర్చులు గణనీయంగా తగ్గాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే కాకుండా, పట్టణాల్లోని మహిళలు కూడా ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని వివరించారు. మున్సిపాలిటీల్లో మహిళల కోసం దాదాపు రూ.6 వేల కోట్ల మేర వడ్డీలేని రుణాలు మంజూరు చేశామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌‌కే పరిమితం కాకుండా అన్ని మున్సిపాలిటీలు, నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్షేమంతోపాటు పరిశ్రమలు, మౌలిక వసతులు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.