వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య అనే వ్యక్తి గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ 11వ సారి పోలీసులకు పట్టుబడ్డాడు.
ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనదారున్ని బుధవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా, సదరు వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 30 రోజులు జైలు శిక్ష విధించింది. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.ఫాతిమా చిన్నప్ప తీర్పు వెల్లడించినట్లుగా కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు.
ఇదిలా ఉండగా.. డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడినవారితో గ్రేటర్ వరంగల్ అదాలత్‍లోని జిల్లా కోర్ట్ జనవరి 5, 2026న కిక్కిరిసిన సంగతి తెలిసిందే. థర్టీ ఫస్ట్ నైట్ మద్యం తాగి రోడ్ల మీదకు వచ్చిన వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 436 కేసులు బుక్ చేశారు.
ఆయా ప్రాంతాల్లో పట్టుబడిన వారు కోర్టులో ఫైన్లు కట్టేందుకు వచ్చారు. దీంతో వందల మంది తరలివచ్చి క్యూ కట్టడడంతో కోర్ట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సందడిగా కనిపించింది.
