- లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల కిటకిట
- బోనాలతో తరలివచ్చిన భక్తజనం
- అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి
- కొండా సురేఖ, పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన మంత్రి పొన్నం
- శాలిబండలోని ముత్యాలమ్మకు మంత్రి వివేక్ దంపతుల పట్టువస్త్రాల సమర్పణ
- హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ సిటీ/ చార్మినార్, వెలుగు: హైదరాబాద్ మహా నగరం బోనమెత్తింది. ఏ వీధి చూసినా, ఏ ఆలయం వద్దకు వెళ్లినా బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు చివరి ఆదివారం కావడంతో ఓల్డ్ సిటీతో పాటు అన్ని ఆలయాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచే మహిళలు బోనమెత్తుకుని అమ్మవార్ల ఆలయాలకు తరలివచ్చారు.
పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాల ముస్తాబు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. వీటితో పాటు హరిబౌలిలోని అక్కన్న మాదన్న, శాలిబండలోని ముత్యాలమ్మ ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మతో పాటు ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్ట్రాలు సమర్పించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ మందడి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సంధ్యారాణి దంపతులు లాల్ దర్వాజలోని అమ్మవారికి ఒడి బియ్యం, పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, హైకోర్టు జడ్జి ఎస్.నంద లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు, కమిటీ సభ్యులు ప్రముఖులకు ఘన స్వాగతం పలికారు.
మీరాలం మండిలోని మహాకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్టువస్త్రాలు సమర్పించారు. టీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కవిత లాల్ దర్వాజ, వీరాలం మండిలో బోనం సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌లోని దాదాపు 29 ఆలయాల్లో బోనాల పండుగ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి అధికారికంగా కేటాయించిన ఆలయాల్లో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు పంపించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు శుక్రవారం రోజే సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కుటుంబ సమేతంగా, బడంగ్‌పేట్ మాజీ మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి దంపతులు లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు.
చివరి భక్తుడికి దర్శనం కలిగేలా ఏర్పాట్లు..
హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు నిధులు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణపై ఉండాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
చివరి భక్తునికి కూడా దేవాలయాల్లో దర్శనం కల్పించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందన్నారు. అనంతరం మీరాలం మండి మహంకాళేశ్వర ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా అన్ని దేవాలయాల్లో బోనాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
5 లక్షల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు..
లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించింది. భక్తులకు తాగు నీరు, మెడికల్ టీమ్, ఫైరింజన్, అంబులెన్స్‌లను ఏర్పాటు చేసింది.
ఆలయ పరిసరాల్లో పోలీసు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఆలయ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ.. లాల్ దర్వాజ మహంకాళి జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి బోనాల జాతర రెండు రోజులు ముందుగానే శివసత్తులు, జోగినీలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
వీఐపీలు, వీవీఐపీలు లాల్ దర్వాజలో అమ్మవారిని దర్శించుకునే సమయాన్ని నిర్దేశించామన్నారు. లాల్ దర్వాజ అమ్మవారిని దాదాపు 5 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందని అందుకు తగినట్లు సౌకర్యాలు కల్పించామని తెలిపారు.
అలాగే, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజులు నిర్వహించి, అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
2,400 మంది పోలీసులతో బందోబస్తు: సజ్జనార్
సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు. దొంగలు, చైన్ స్నాచర్లను త్వరగా గుర్తించేందుకు ఏఐ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. 2,400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల రక్షణ కోసం షీ టీమ్‌లు, క్రైమ్ టీమ్‌లను రంగంలోకి దించడంతో పాటు ఆలయాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
ఆలయ ప్రాంగణాలతో పాటు ఊరేగింపు సాగే మార్గాల్లో డ్రోన్లు, అదనపు సీసీ కెమెరాలను అమర్చామన్నారు. అదనపు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్, అదనపు సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్షీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలమ్మకు మంత్రి వివేక్ దంపతులు పట్టువస్త్రాల సమర్పణ
శాలిబండలోని ముత్యాలమ్మ అమ్మవారికి మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడుతూ పాడి పంటలతో సిరి సంపదలను కలగజేయాలని వేడుకున్నట్టు తెలిపారు.
హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను మంత్రి శ్రీధర్ బాబు సమర్పించారు. అలాగే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రజాప్రతినిధులతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, పోలీస్ కమిషనర్ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
యూసఫ్‌గూడలో ఘనంగా వేడుకలు
- అమ్మవారిని దర్శించుకున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్, పొంగులేటి, శ్రీధర్ బాబు, వాకిటి
జూబ్లీహిల్స్/అంబర్‌పేట్, వెలుగు: బోనాల పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసఫ్‌గూడలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న మహమూద్ ఫంక్షన్ హాల్‌లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం సమర్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మంత్రులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ కుటుంబం ఎన్నో ఏండ్లుగా తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బోనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మరోవైపు, అంబర్‌పేట్ రత్న నగర్‌లోని శ్రీముత్యాలమ్మ బంగారు మైసమ్మ దేవాలయానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మరిపల్లి శ్రీకాంత్, మేడి వెంకటేశ్, తండు లాలాయ, సన్నిత్, పాదం వెంకటేష్, భాస్కర్, భరత్, నర్సింగరావు తదితరులు ఉన్నారు.
