- దేశంలో 2021 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 48.95 కోట్ల కన్సల్టేషన్లు
- మన రాష్ట్రంలో 3.37 కోట్ల కన్సల్టేషన్లు.. 958 హబ్‌లలో సేవలు
- 8.64 కోట్ల కన్సల్టేషన్లతో బెంగాల్ ఫస్ట్.. 8.5 కోట్లతో ఏపీ సెకండ్
- దేశంలో 524 డే కేర్ క్యాన్సర్ సెంటర్లు.. మన రాష్ట్రంలో 34
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెలీమెడిసిన్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల వంటి అవసరం ఎక్కువగా ఉన్నోళ్లే ఈ టెలీమెడిసిన్ సర్వీస్‌ను వాడుకుంటున్నారు. అసంక్రమిత వ్యాధులు సహా చాలా రకాల జబ్బులను టెలీమెడిసిన్ సర్వీసుల ద్వారా ప్రజలు చూపించుకుంటున్నట్టు కేంద్రం వెల్లడించింది.
భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కింద నిర్వహిస్తున్న ఈ టెలీమెడిసిన్ ప్రోగ్రామ్‌లో ఇప్పటివరకు 48.95 కోట్ల కన్సల్టేషన్లు జరిగాయని పేర్కొంది. లోక్‌సభలో కేంద్రం ఈ మేరకు డేటాను వెల్లడించింది. 2021 సెప్టెంబర్‌లో దీన్ని ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది జులై వరకు ఈ సర్వీసుల్లో భాగంగా ఇప్పటివరకు తెలంగాణలో 3.37 కోట్ల మంది వినియోగించుకున్నట్టు పేర్కొంది.
రాష్ట్రంలో 958 హబ్‌లలో టెలీమెడిసిన్ సేవలు అందిస్తుండగా.. 5,714 మంది నిపుణుల నుంచి వివిధ జబ్బులకు సలహాలు అందజేస్తున్నారు. 3.37 కోట్ల కన్సల్టేషన్లలో 3.36 కోట్ల కన్సల్టేషన్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా జరిగినట్టు వెల్లడించింది. మరో 28 వేల కన్సల్టేషన్లు ఓపీ కోసం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా 19,257 హబ్‌లు
దేశవ్యాప్తంగా 19,257 హబ్‌ల ద్వారా టెలీమెడిసిన్సేవలను అందిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. 1,41,341 మంది నిపుణులు టెలీమెడిసిన్ ద్వారా సలహాలు ఇస్తున్నట్టు తెలిపింది. పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, జిల్లా ఆస్పత్రుల వంటి వాటిల్లో టెలీమెడిసిన్ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
రోగ లక్షణాలను తెలుసుకునేందుకు ఏఐ ఆధారిత క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్‌ను ఈ సంజీవని 2.0 ప్లాట్‌ఫాంలో ఏర్పాటు చేసినట్టు కేంద్రం తెలిపింది. మొత్తం 48.95 కోట్ల కన్సల్టేషన్లలో 2023లో ఈ సంజీవని 2.0ని అప్డేట్ చేశాక వచ్చినవే ఎక్కువున్నాయి. ఈ కాలంలోనే 30.4 కోట్ల కన్సల్టేషన్లు జరిగాయి.
కాగా, టెలీమెడిసిన్ సేవలను అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో వినియోగించుకున్నారు. 8.64 కోట్ల కన్సల్టేషన్లతో ఆ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. 8.59 కోట్ల కన్సల్టేషన్లతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 7.41 కోట్ల కన్సల్టేషన్లతో తమిళనాడు మూడో స్థానం, 7.10 కోట్ల కన్సల్టేషన్లతో ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. 3.37 కోట్ల కన్సల్టేషన్లతో మన రాష్ట్రం ఐదో స్థానంలో ఉంది.
524 డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
దేశంలో 524 డే కేర్ క్యాన్సర్సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్అండ్కంట్రోల్ఆఫ్నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌లో భాగంగా రాష్ట్రాలు పంపిస్తున్న ప్రతిపాదనలకు అనుగుణంగా డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. మన రాష్ట్రంలో 34 డే కేర్ క్యాన్సర్ సెంటర్లున్నట్టు కేంద్రం తన డేటాలో వెల్లడించింది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 52, రాజస్థాన్‌లో 41, తమిళనాడు, వెస్ట్బెంగాల్లలో 38, గుజరాత్లో 36 చొప్పున క్యాన్సర్ సెంటర్లున్నట్టు తెలిపింది.
