గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లపై పార్టీల గురి... రెండు చోట్లా పాగా వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లపై పార్టీల గురి... రెండు చోట్లా పాగా వేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్
  • మార్చితో ముగియనున్న వాణీదేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం..
  • హైదరాబాద్ సీటుపై బీజేపీ కన్ను.. అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు
  • వచ్చే నెలలో ఓటర్ల ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్ నోటిఫికేషన్!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్​లు ఓటర్లుగా ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది మార్చితో ఖాళీ కానున్న రెండు సీట్లపై ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి. మహబూబ్‌‌‌‌నగర్–-రంగారెడ్డి-–హైదరాబాద్‌‌‌‌తో పాటు వరంగల్–-ఖమ్మం–-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, తీన్మార్ మల్లన్న పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో సెప్టెంబర్ మూడో వారంలో ఓటర్ల ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక, ఓట్ల నమోదుపై పార్టీలు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తున్నాయి.

బీఆర్ఎస్ కొత్త ప్రయోగం.. 

వరుస ఓటములతో డీలా పడ్డ బీఆర్ఎస్.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సీటులో ఓ ఐఆర్ఎస్ అధికారిని బరిలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే సర్వీస్‌‌‌‌లో ఉన్న ఉదయ్‌‌‌‌నాథ్ అనే అధికారి ఇప్పటికే కేటీఆర్‌‌‌‌తో పలుమార్లు భేటీ అయ్యారు. ఆయనతో పాటు మరో రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, మరో సీనియర్ లాయర్ కూడా రేసులో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 

వరంగల్ సీటులో నిరుద్యోగ పోరాటాలతో యాక్టివ్‌‌‌‌గా ఉన్న బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్‌‌‌‌తో మీటింగ్స్ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఓయూ జేఏసీ నేతలు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్‌‌‌‌పై బీజేపీ నజర్ 

రెండు టీచర్ ఎమ్మెల్సీలను గెలుచుకున్న బీజేపీ.. ఈసారి గ్రాడ్యుయేట్ స్థానాల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తోంది. హైదరాబాద్​లో ఎమ్మెల్సీగా పోటీ చేసే ఉద్దేశం లేదని ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఇప్పటికే ముఖ్య నేతలకు చెప్పేశారు. దీంతో సెగ్మెంట్ పై ఆశావహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉండటంతో.. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే గెలుపు సులువేనన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు. 

ఈ స్థానం నుంచి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనవడు ఎన్వీ సుభాష్ తో పాటు మాజీ అధికార ప్రతినిధి సారంగుల అమర్ నాథ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో చదువుకున్న అనుభవం సుభాష్​కు ఉండగా.. అమర్ నాథ్ ఐఐటీ రూర్గీలో విద్యాభ్యాసం చేశారు. వీరిద్దరూ పార్టీ పెద్దలతో పాటు సంఘ్ నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. వీరితో పాటు జేపీ ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ వెంకట్ రెడ్డి, పార్టీ నేత పవన్ కుమార్ కూడా రేసులో ఉన్నారు. 

అటు వరంగల్ స్థానానికి పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లుతో పాటు పార్టీ సీనియర్ నేతలు మనోహర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వచ్చే నెలలో ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల ఎంపికపై 
కమలదళం కసరత్తు ముమ్మరం చేసింది. 

కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ప్లాన్.. 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకుని తమ బలం చూపించాలని చూస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటించి.. వారిని గ్రౌండ్ లెవల్‌‌‌‌లోకి పంపాలని ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ మీటింగ్‌‌‌‌లో నిర్ణయించారు. నల్గొండ సీటు కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల కీలక నేత, పీసీసీ నేత చనగాని దయాకర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

హైదరాబాద్ సీటు కోసం పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డితో పాటు పీసీసీ నేతలు గౌరీ సతీశ్, హర్షవర్ధన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లోని ఓ జిల్లా అధ్యక్షుడు కూడా పోటీలో ఉన్నారు. జిల్లా ఇన్‌‌‌‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఓటర్లతో మంచి కనెక్షన్ ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

పోటీలో పీఆర్టీయూ.. 

మరోవైపు ఈసారి పీఆర్టీయూ టీచర్ సంఘం కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. పీఆర్టీయూ జనరల్ సెక్రటరీ సుంకరి భిక్షంగౌడ్‌‌‌‌ను బరిలోకి దింపాలని ఆ సంఘం నిర్ణయించింది. ఇప్పటికే అదే సెగ్మెంట్‌‌‌‌లో టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ ప్రతినిధి శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. టీచర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లపై ఆ సంఘం గట్టిగా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే జిల్లాల వారీగా మీటింగ్స్ పెడుతూ.. ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.