- బహుళ అంతస్తుల ఫ్యాక్టరీలు
- సొంత స్థలం లేకున్నా పరిశ్రమల ఏర్పాటు.. తగ్గనున్న తయారీ వ్యయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం మౌలిక వసతులను విస్తరిస్తోంది. ‘మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ కింద చిన్న పారిశ్రామికవేత్తలపై భారం తగ్గించేలా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తోంది.
సొంతంగా భూమి కొనుగోలు చేసి మౌలిక వసతులు కల్పించుకునే స్థోమత లేని వారికి ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానం ఉపయోగపడనుంది. సిద్ధంగా ఉన్న భవనాల్లో యంత్రాలు ఏర్పాటు చేసుకుని వెంటనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశం కల్పిస్తున్నారు.
ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, సిద్దిపేట సమీపంలోని తునికి బొల్లారం, యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌తో పాటు హైదరాబాద్‌లోని పరిశ్రమల పార్కుల అనుబంధ క్లస్టర్లలో 5 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం పూర్తయింది.వీటిని అర్హులైన పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఏర్పాట్లు చేస్తోంది.
కేటాయింపులకు సిద్ధంగా ఫ్యాక్టరీలు
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వ్యర్థాల నిర్వహణ, భద్రత వంటి మౌలిక వసతులను ముందుగానే కల్పించారు. దీంతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం సమయం, డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. స్థలం సిద్ధంగా ఉండటంతో యంత్రాలు ఏర్పాటు చేసుకుని ఉత్పత్తి ప్రారంభించవచ్చు.
ఫలితంగా పరిశ్రమల ఏర్పాటు సమయం, ప్రారంభ వ్యయం తగ్గనుంది. కాలుష్య రహిత, తేలికపాటి తయారీ రంగాలకు అనుగుణంగా ఈ సముదాయాలను రూపొందిస్తున్నారు. గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యావరణహిత ప్యాకేజింగ్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ వంటి రంగాల ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ఇక్కడ వసతులు కల్పించనున్నారు.
వర్కింగ్ స్పేస్, షెడ్ల రూపంలో యూనిట్లను కేటాయించే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా కొత్త స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలు భారీ భూ వ్యయం లేకుండానే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
మరో 31 ప్రతిపాదనలు
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలకు వస్తున్న ఆదరణ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. అదనంగా 15 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలను సిద్ధం చేసి టీజీఐఐసీ పరిశీలనకు పంపింది. వీటిలో 3 ప్రతిపాదనలపై చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) అప్రైజల్ పూర్తయి తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
మరో 16 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ప్రతిపాదనలు ముందస్తు పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా మరో 31 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే సొంత స్థలం కొనుగోలు చేయలేని చిన్న పరిశ్రమలు నగరాలు, పట్టణాల సమీపంలోనే ఆధునిక వసతులతో యూనిట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం లభించనుంది. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు ఊతమివ్వనున్నాయి.
కామన్ ఫెసిలిటీ సెంటర్లతో తగ్గనున్న భారం
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల్లో స్థలంతో పాటు కామన్ ఫెసిలిటీ సెంటర్లు (సీఎఫ్‌సీ) ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. భారీ యంత్రాలు, టెస్టింగ్ కేంద్రాలు, నాణ్యత పరీక్ష వసతులను ప్రతి పరిశ్రమ విడిగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా వీటిని ఉమ్మడిగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో చిన్న పరిశ్రమలపై పెట్టుబడి భారం తగ్గనుంది. ఉత్పత్తి వ్యయం తగ్గడంతో మార్కెట్‌లో పెద్ద కంపెనీలతో పోటీపడేలా ఎంఎస్‌ఎంఈలకు వెసులుబాటు కలగనుంది.
