- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వృద్ధులపై సైబర్ ఎటాక్స్..
- ట్రేడింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులతో జీవితకాల సంపాదన హాంఫట్
జూబ్లీహిల్స్‌కు చెందిన 75 ఏండ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట మెసేజ్ వచ్చింది. మొదట చిన్న చిన్న టాస్క్‌లతో కొంత డబ్బు ఇచ్చి నమ్మకం కుదిర్చారు. తర్వాత టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చి, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ పేరిట ఆశ చూపారు. స్క్రీన్‌పై నకిలీ లాభాలు చూపిస్తూ విత్‌డ్రా, ప్రాసెసింగ్ చార్జీల పేరుతో ఆయన వద్ద నుంచి విడతలవారీగా రూ.96 లక్షలు కొల్లగొట్టారు.
70 ఏళ్ల విశ్రాంత గెజిటెడ్ అధికారికి వాట్సాప్ వీడియో కాల్ చేసిన కేటుగాడు.. ముంబై పోలీస్ అధికారి అనూప్ కుమార్ శర్మగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, వెంటనే అరెస్ట్ చేస్తామంటూ నకిలీ పేపర్లతో భయాందోళనకు గురిచేశాడు. బ్యాంక్ ఖాతాల తనిఖీ పేరిట ఒకే ఆర్టీజీఎస్ లావాదేవీ ద్వారా రూ.85 లక్షలు కొట్టేశాడు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సీనియర్ సిటిజన్స్ ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాల్సిన సీనియర్ సిటిజన్లను బురిడీ కొట్టిస్తూ వారి కష్టార్జితాన్ని కాజేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ పరిధిలో 19 నెలల్లో(2025 జనవరి నుంచి 2026 జులై 31 వరకు) 60 ఏండ్లు దాటిన 403 మందిని టార్గెట్చేసిన సైబర్క్రిమినల్స్రూ.102.02 కోట్లను కొల్లగొట్టారు.
ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఓటీపీ మోసాలు..
సీనియర్ సిటిజన్లను ప్రధానంగా ట్రేడింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాల ద్వారా నేరగాళ్లు మోసగిస్తున్నారు. అత్యధిక ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్న ట్రేడింగ్ మోసాలలో 113 కేసుల్లో వృద్ధులు రూ.55.88 కోట్లకు పైగా కోల్పోయారు. విదేశీ మారక ద్రవ్యం, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు వస్తాయని వాట్సాప్, టెలిగ్రామ్ వేదికలుగా నకిలీ యాప్‌లతో ఆశ చూపుతున్నారు. సీబీఐ, ఈడీ, పోలీసు అధికారులమంటూ యూనిఫారాల్లో వీడియో కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ 69 మంది నుంచి రూ.31.93 కోట్లు లాగారు. 115 ఓటీపీ మోసాల ద్వారా రూ.4.94 కోట్లు, 22 ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ల ద్వారా రూ.2.79 కోట్లు కొల్లగొట్టారు.
ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని..
వృద్ధుల్లోని ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని డేటింగ్ ఫ్రాడ్స్, హనీట్రాప్స్ ద్వారా కేటుగాళ్లు వల వేస్తున్నారు. 19 నెలల్లో డేటింగ్, హనీ ట్రాప్ద్వారాఏడుగురు వృద్ధుల నుంచి రూ.70.11 లక్షలు మోసం చేశారు. అలాగే, సోషల్ మీడియాలో నకిలీ ఐడీలతో పరిచయం పెంచుకుని అత్యవసర ఖర్చులు, గిఫ్ట్‌ల కస్టమ్స్ డ్యూటీ పేరిట లక్షల్లో దండుకుంటున్నారు. పరువు పోతుందనే భయంతో బాధితులు పోలీసులకు చెప్పకపోవడం నేరగాళ్లకు కలిసివస్తోంది. ఈ దర్యాప్తులో వృద్ధుల విషయంలో పిల్లల పర్యవేక్షణ కొరవడుతోందని, వాళ్లు ఫోన్లలో ఏం చేస్తున్నారో తెలియకపోవడం, స్మార్ట్ఫోన్లపై వారికి అవగాహన కల్పించకపోవడం కూడా సమస్యకు కారణమంటున్నారు.
ప్రారంభంలోనే అడ్డుకుంటే..
కొన్ని సైబర్ మోసాలను బ్యాంకర్లు సమయస్ఫూర్తితో ప్రారంభంలోనే అడ్డుకుంటున్నారు. వృద్ధులు అకస్మాత్తుగా ఫిక్సుడ్డిపాజిట్లను రద్దు చేసుకుంటున్నా లేదా అపరిచిత అకౌంట్లకు పెద్ద మొత్తాలను ట్రాన్స్ఫర్చేస్తున్నా కొంతమంది బ్యాంకు సిబ్బంది అనుమానంతో తక్షణమే స్పందించి అడ్డుకున్నారు.
వృద్ధుల భయాందోళనలను గమనించి ఆ ట్రాన్సాక్షన్స్నిలిపివేయడం, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడం ద్వారా బ్యాంకర్లు వారి జీవితకాల సంపాదనను కాపాడగలుగుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంతమంది వృద్ధులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుంటున్నారని, తమ బ్యాంకు లావాదేవీలపై పరిమితులు విధించాలని కోరుతున్నారని అధికారులు చెప్తున్నారు.
కాస్త తగ్గుముఖం..
పోలీసుల చొరవతో 2025తో పోలిస్తే 2026లో సీనియర్ సిటిజన్లపై నమోదవుతున్న కేసులు, ఆర్థిక నష్ట తీవ్రత గణనీయంగా తగ్గింది. గత ఏడాది నెలకు సగటున 24 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది పోలీసు నిఘా వల్ల అది17కు పడిపోయింది. 2025లో 285 కేసులు నమోదై రూ.71.81 కోట్ల నష్టం వాటిల్లగా, 2026 మొదటి ఏడు నెలల్లో ఈ కేసుల సంఖ్య 118కి చేరింది. నష్టం రూ. 30.20 కోట్లుగా నమోదైంది.
బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి రికవరీకి చర్యలు తీసుకుంటున్నారు. సైబర్‌నేరానికి గురైనట్టు అనుమానం వస్తే వెంటనే 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్సీపీ సజ్జనార్పిలుపునిచ్చారు.
