ఈ వారం ఐపీఓల పండుగ.. ఐదు మెయిన్ బోర్డ్ ఇష్యూలు ప్రారంభం

ఈ వారం ఐపీఓల పండుగ.. ఐదు మెయిన్ బోర్డ్ ఇష్యూలు ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీయ ఐపీఓ  మార్కెట్ ఈ వారం ఫుల్‌‌ బిజీగా ఉండనుంది. ఆటో విడిభాగాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్‌‌మిషన్, ఈ-–కామర్స్ ప్లాట్‌‌ఫామ్ షిప్‌‌రాకెట్, మిల్కీ మిస్ట్ డెయిరీ సహా మొత్తం 5  కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి  సిద్ధమయ్యాయి. సుమారు రూ. 7,443 కోట్లను సమీకరించనున్నాయి.

ఐపీఓలు ఇలా..

  • ధూత్ ట్రాన్స్‌‌మిషన్  రూ. 3,067 కోట్ల ఇష్యూ సైజుతో ఆగస్టు 10 న  రానుంది. ప్రైస్ బ్యాండ్ రూ.829– రూ.871 గా నిర్ణయించారు. ఇందులో రూ.1,400 కోట్ల కొత్త షేర్లు, బెయిన్ క్యాపిటల్ వంటి ప్రమోటర్ల  నుంచి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌ఎస్‌‌)  ఉన్నాయి.
  • మోల్బియో డయాగ్నోస్టిక్స్   రూ. 940 కోట్ల ఐపీఓ కూడా ఆగస్టు పదినే  షురూ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ రూ.768–రూ.807. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌‌సీ),  కొన్ని ఆల్టర్నేటివ్ ఫండ్స్‌‌ (ఏఐఎఫ్‌‌)  ఈ కంపెనీలో భారీగా యాంకర్ పెట్టుబడులు పెట్టాయి.
  • భారత డెయిరీ రంగంలోనే  అతిపెద్ద ఐపీఓగా మిల్కీ మిస్ట్ డెయిరీ ఇష్యూ నిలవనుంది. ఈ కంపెనీ రూ. 1,553 కోట్లు సేకరించాలని చూస్తోంది. ప్రైస్ బ్యాండ్ రూ.133–రూ.140గా నిర్ణయించారు. ఆగస్టు 11 న ఐపీఓ ఓపెన్‌‌ అవుతుంది.
  • టెమాసెక్, లైట్‌‌రాక్ వంటి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలకు వాటాలున్న లాజిస్టిక్స్ కంపెనీ షిప్‌‌రాకెట్  రూ. 1,617.5 కోట్ల ఐపీఓను ఆగస్టు 12న ప్రారంభించనుంది. ప్రైస్ బ్యాండ్ రూ.92 –రూ.97.
  • బెహారీ లాల్ ఇంజనీరింగ్ ఐపీఓ కూడా ఇదే రోజు ఓపెన్ అవుతుంది. ఈ కంపెనీ  రూ. 302 కోట్లు సేకరించనుంది. ప్రైస్ బ్యాండ్ రూ.271 -– రూ.285 గా నిర్ణయించారు.
  • ఇప్పటికే కేకేఆర్ మద్దతు ఉన్న 'లీప్ ఇండియా', 'టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్' ఐపీఓలు సబ్‌‌స్క్రిప్షన్‌‌లో ఉండగా, ఈ 5 కంపెనీలతో కలిపితే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలకు వచ్చిన కంపెనీల సంఖ్య 47కి చేరుతుంది.
  • బ్లాక్‌‌స్టోన్ మద్దతు ఉన్న హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్, షాంకేష్ జ్యువెలర్స్ వంటి మరిన్ని కంపెనీలు కూడా త్వరలోనే తమ ఐపీఓ ప్రైస్ బ్యాండ్లను ప్రకటించనున్నాయి.