- హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో పలు రకాల పనులు
- పొరుగు రాష్ట్రాల కూలీలను నమ్మని యజమానులు
- తెలంగాణ వాళ్ల కోసం గేటెడ్ కమ్యూనిటీల్లో పట్టు
- ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఊళ్ల నుంచి హైదరాబాద్ బాట
హైదరాబాద్, వెలుగు: పల్లెవాసిని పట్నం పిలుస్తంది. బతుకుదెరువు కోసం పట్నం దారి పడుతున్నాడు. హైదరాబాద్ సిటీలో వేగంగా పెరుగుతున్న హైరైజ్ బిల్డింగ్స్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీల సంస్కృతి ఈ వలస జీవులకు సరికొత్త ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి.
ఇటీవల జరిగిన పలు ఘటనలతో పొరుగు రాష్ట్రాల కూలీల స్థానంలో తెలంగాణ కార్మికులను పనిలో పెట్టుకునేందుకు నగరవాసులు మొగ్గు చూపుతుండడం కూడా కలిసి వస్తున్నది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ‘ఎల్ నినో’ ప్రభావంతో పల్లెల్లో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో చేతినిండా పని లేక సన్న, చిన్నకారు రైతులు, రైతు కూలీలు గంపెడు ఆశలతో పట్నం బాట పడుతున్నారు.
పట్నంలో పలు రంగాల్లో ఉపాధి
హైదరాబాద్నగరానికి చేరుకుంటున్న వలస కుటుంబాలకు ఐటీ కారిడార్‌లోని కోకాపేట, గచ్చిబౌలి, తెల్లాపూర్ లాంటి ఏరియాలతో పాటు శివార్లలో భారీగా హైరైజ్ బిల్డింగ్స్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. దీంతో ఇక్కడ రకరకాల పనులకు అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు పాలమూరు లాంటి ప్రాంతాల నుంచి వచ్చే రైతుకూలీలకు కేవలం భవన నిర్మాణ రంగంలోనే తాపిపని, కూలిపని దొరికేది. కానీ, ఇప్పుడు వివిధ రకాలుగా నిరంతరాయ ఉపాధి లభిస్తోంది.
టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసినవారు ఎలక్ట్రిషియన్లుగా, టెక్నీషియన్లుగా, గిగ్వర్కర్లుగాపనుల్లో చేరుతుండగా.. చదువుకోనివారు వాచ్మన్లుగా, వంట మనుషులుగా, ప్లంబర్లుగా, ఎస్టీపీ ప్లాంట్లు, కామన్ ఏరియాలు శుభ్రం చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా, ల్యాండ్‌స్కేప్ గార్డెన్లను చూసుకునే తోటమాలీలుగా ఉపాధి పొందుతున్నారు.
లగ్జరీ కమ్యూనిటీల్లో నివసించే ఐటీ ఉద్యోగులు, సంపన్న కుటుంబాల బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఇలాంటి గృహ కార్మికులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాల వారిని, నేపాల్నుంచి వలసవచ్చినవారిని వాచ్మెన్లుగా, వంటవాళ్లుగా, హౌస్‌కీపింగ్ సిబ్బందిగా నియమించుకునేవారు. ఇటీవలికాలంలో పలు ఇండ్లలో యజమానులను చంపి, ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తున్న ఉదంతాలు పెరగడంతో వారి స్థానంలో తెలంగాణ, ఏపీవారికే యజమానులు మొదటి ప్రాధన్యమిస్తున్నారు.
జీతం ఎక్కువైనా ఫర్వాలేదంటూ స్థానికులను, నమ్మకస్థులనే నియమించుకుంటున్నారు. ఈ క్రమంలో పల్లెల్లో ఉపాధిలేక పస్తులుండే బదులు పట్నంలో ఏదో ఒక పనిచూసుకొని పిల్లల్ని చదివించాలనే ఆలోచనతో ఒకరిని చూసి ఒకరు వందలు, వేల కుటుంబాలు సిటీ బాటపడ్తున్నాయి.
పల్లెలపై ఎల్ నినో ఎఫెక్ట్..
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. వానాకాలం మొదట్లో రుతుపవనాలు పూర్తిగా మొహం చాటేశాయి. ఆ తర్వాత అడపాదడపా వర్షాలు పడినా గోదావరి, కృష్ణా నదుల్లోకి పెద్దగా వరద రాలేదు. దీంతో ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండలేదు.
ఈ కారణంగా ఖరీఫ్ సీజన్లో నీరు ఎక్కువగా అవసరమయ్యే వరినాట్లు వేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో వరి సాగు తగ్గింది. తమకున్న కొద్దిపాటి భూమిలో కోతుల బెడద కారణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసే పరిస్థితి లేక సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు బతుకుదెరువు వెతుక్కుంటూ సిటీ బాట పడుతున్నారు.
రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి గ్రామాల నుంచి హైదరాబాద్ మెగా సిటీలోకి సుమారు 10 లక్షల మంది వలస వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా వలసలు పెరిగాయని, సిటీలో భార్యా భర్తలకు, 18 ఏండ్లు నిండిన పిల్లలకు వారి చదువును బట్టి ఉపాధి దొరుకుతుండటంతో కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటున్నారని చెప్తున్నారు.
హైరైజ్ బిల్డింగ్స్, వందల ఎకరాల్లో విస్తరించి ఉండే గేటెడ్ కమ్యూనిటీలను శుభ్రంగా ఉంచడం ఒక పెద్ద టాస్క్. నిత్యం వేలాది మంది తిరిగే కామన్ ఏరియాలు, క్లబ్ హౌస్‌లు, రోడ్లను శుభ్రం చేయడానికి వందలాది మంది మహిళలు, పురుషులు అవసరమవుతున్నారు. లగ్జరీ కమ్యూనిటీలలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్లు, పచ్చదనం కాపాడటానికి, మొక్కలు నాటడానికి తోటమాలీలకు డిమాండ్ ఉంది.
ఇక్కడ నివసించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తల బిజీ లైఫ్‌స్టైల్ వల్ల ఇళ్ల పనులకు స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో అవసరం పడ్తున్నారు. ప్రత్యేకంగా వంటలు చేసే మహిళలకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జీతాలిస్తున్నారు. ఉద్యోగాలకు వెళ్లే దంపతుల పిల్లలను, వృద్ధులను చూసుకోవడానికి మహిళలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.
వేలాది ఫ్లాట్లు ఉండే హైరేజ్డ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీలకు మూడు షిఫ్టులలో వందలాది మంది సెక్యూరిటీ గార్డులు, సూపర్ వైజర్లు అవసరం అవుతున్నారు. గేట్ల దగ్గరకు వచ్చే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, జెప్టో వంటి ఈ-కామర్స్ పార్సిళ్లను స్కాన్ చేయడం, లోపల యజమానులకు అందించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తున్నారు.
అత్యాధునిక లిఫ్టులు, సెంట్రల్ ప్లంబింగ్, పవర్ బ్యాకప్ సిస్టమ్స్ చూసుకోవడానికి ప్రతిరోజూ సాంకేతిక నిపుణులు కావాలి. పని తెలిసిన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకు నెలవారీ జీతమిచ్చి తాత్కాలిక, పర్మనెంట్ సిబ్బందిగా నియమించుకుంటున్నారు. వందలాది ఫ్లాట్లు ఉండే భవనాల్లో లిఫ్టులు, వాటర్ పంపుల రిపేర్లు, మెయింటెనెన్స్ చేసేవారికి నిరంతరం డిమాండ్ ఉన్నది. మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు నిర్వహించడానికి ప్రత్యేక సిబ్బందికి చేతినిండా పని దొరుకుతున్నది.
నాలా ఎంతో మంది మహిళలు పనిచేస్తున్నరు
నా పేరు మౌనిక, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మాది హన్మకొండ జిల్లా హసన్‌పర్తి గ్రామం. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఊరిలో పనులు దొరక్క హైదరాబాద్ వచ్చి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో లేడీ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేసే మహిళలను చెక్ చేసి ఆఫీస్ లోపలికి పంపించడమే నా పని.
రోజుకు 8 గంటలు డ్యూటీ. నీడ పట్టున ఉండొచ్చు. నెలకు రూ.20 వేలకు పైగా జీతం ఇస్తారు. పీఎఫ్ కూడా కట్ అవుతుంది. ఈ జీతం డబ్బులతో నా ఇద్దరు కూతుర్లను చదివించుకుంటున్నాను. మన రాష్ట్రానికే చెందిన ఎందరో మహిళలు ఇక్కడ నాలాగే అనేక కంపెనీలలో పనిచేస్తున్నారు.
లోకల్ వాళ్లనే నమ్ముతున్నారు
నా పేరు రాజేందర్, వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామం. నేను పదో తరగతి పాస్ అయ్యాను. ఊరిలో పనులు దొరకడం లేదు. దీంతో నా భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ఓ ట్రాలీ ఆటో నడుపుతున్నాను. నా భార్య కూడా ఇక్కడే ఓ హైరైజ్ బిల్డింగ్‌లో ఉద్యోగం చేస్తున్నది.
ఇద్దరం కలిసి నెలకు రూ.40 వేలకు పైగా సంపాదిస్తున్నాం. నా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఓ ప్రైవేట్ బడిలో చదువుకుంటున్నారు. హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో లోకల్ వాళ్లనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇక్కడ ఉద్యోగం, ఉపాధికి ఎలాంటి ఢోకా లేదు.
