ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థులకు మంత్రి బీఫామ్స్ అందజేశారు. బీ-ఫామ్స్ అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆయన సూచించారు.
వార్డులవారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏదులాపురంలోని అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తాం..
బీఆర్ఎస్ నాయకులుఅధికారంలో ఉన్న పదేండ్లు నిరుపేదలను పట్టించుకోకుండా నేడు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం ఏదులాపురం మున్సిపాలిటీలోని 7, 8, 9, 12, 13 వార్డుల్లో నిర్వహించిన ప్రచార రోడ్ షోలో ఆయన పాల్గొని విపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన ప్రతిఒక్కరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు.
