విశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. ఎర్రటి అలలు ఎగిసిపడుతున్నాయి.. ఎందుకిలా..?

విశాఖలో ఎరుపెక్కిన సముద్రం.. ఎర్రటి అలలు ఎగిసిపడుతున్నాయి.. ఎందుకిలా..?

సలార్ సినిమాలో ప్రభాస్ కన్సార్ ఎరుపెక్కాలా అన్నట్లు వైజాగ్ లోని సముద్రం ఎరుపెక్కింది. ఆర్కే బీచ్ లో ఎగసిపడుతున్న అలలు ఎరుపు రంగులోకి మారాయి.. అది నీరా లేక రక్తమా అన్నట్లు ఎర్రగా ఎగసిపడ్డాయి అలలు. ఈ సీన్ చూసి అక్కడున్నవారు షాకయ్యారు. సబ్ మెరైన్ మ్యూజియం దగ్గర్లో కనిపించిన ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేశారు. సముద్రంలో అలలు ఎర్రగా ఎగసిపడుతున్న సదరు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో సముద్రం ఎందుకు ఎరుపెక్కింది..? ఇది ప్రళయానికి సంకేతమా.. ? సముద్రంలో అసలేం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఇంతకీ సముద్రం ఎర్రగా మారడానికి అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రా యూనివర్సిటీ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగాధిపతి డాక్టర్ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, సముద్ర ప్రవాహాలలోని సూక్ష్మ ప్లాంక్టన్ కారణంగా ఈ రంగు మారినట్లు కనిపిస్తుందని అన్నారు. సముద్రంలో వచ్చే అలలు తమతో పాటు డైనోఫ్లాగెల్లేట్లు, ఇతర ఆల్గే వంటి సూక్ష్మ-ప్లాంక్టన్లను ఒడ్డుకు తీసుకొస్తాయని.. అవి చనిపోయి కుళ్ళిపోవడం మొదలైనప్పుడు అవి విడుదల చేసే ఎర్రటి లిక్విడ్, సేంద్రీయ శిధిలాలు అలల ద్వారా ఒడ్డుకు వస్తాయని.. అందుకే నీటికి ఎర్రటి రంగు వస్తుందని అన్నారు.

ఉష్ణోగ్రత, పోషక లభ్యతను బట్టి సంవత్సరంలోని వివిధ సమయాల్లో వివిధ ఆల్గల్ సమూహాలు ఉదృతంగా ఉంటాయని తెలిపారు డాక్టర్ రమేష్. బ్లూ-గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, డైనోఫ్లాజెల్లేట్‌లు ప్రతి ఒక్కటి నిర్దిష్ట కాలానుగుణ పరిస్థితులలో వృద్ధి చెందుతాయని తెలిపారు. తీరప్రాంత జలాల్లో పోషకాలు సహజంగా సమృద్ధిగా ఉండవని ఆయన అన్నారు. అవి సాధారణంగా వర్షం, నది ఉత్సర్గ, కాలువ ప్రవాహాలు లేదా మురుగునీటి ప్రవాహాల ద్వారా సముద్రంలోకి ప్రవేశిస్తాయని అన్నారు. 

సముద్రంలో అలలు ఒక్కోసారి ఇలాంటి వాటిని ఒడ్డుకు తెస్తాయని, ఆల్గల్ పెరుగుదలకు అనువైన పరిస్థితులను సృష్టిస్తాయని అన్నారు. ఆల్గె వంటి జీవులు వదిలే ఎర్రటి లిక్విడ్ వ్యర్థమే సముద్రం ఎర్రబడటానికి కారణమని అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా.. సముద్రంలో అలలు ప్రవహిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. కొంతమంది నెటిజన్స్ ఎన్టీఆర్ దేవర సినిమాను ప్రస్తావిస్తూ సరదాగా కామెంట్ చేయగా.. ప్రభాస్ సలార్ ప్రస్తావిస్తున్నారు మరికొంతమంది నెటిజన్స్.

కొంతమంది నెటిజన్స్ మాత్రం బ్లూమ్స్ డే ఫిష్ తరహాలో ఇది కూడా ప్రళయానికి సంకేతమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి నిపుణులు చెప్పినదాని ప్రకారం ఇది సముద్రంలో నిత్యం జరిగే సాధారణ ప్రక్రియ అని.. ఇది ఎలాంటి ప్రళయానికి సంకేతం కాదని తేలింది.ఈ పరిణామం కారణంగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఇది సముద్రంలో సహజంగా ఏర్పడే రెడ్ టైడ్ అని...అధిక వర్షపాతం, అలల ఉధృతి పెరగడం కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.ఇలాంటి సమయాల్లో స్విమ్మింగ్ కి దూరంగా ఉండటం బెటర్ అంటూ సూచిస్తున్నారు.