వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బుధవారం (ఫిబ్రవరి 4) ముంబై వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది, బ్యాటింగ్ లో ఇషాన్ కిషాన్ (53), తిలక్ వర్మ (45), హార్దిక పాండ్య (30) దుమ్ములేపితే.. బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్ లో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి ఓడిపోయింది.
241 పరుగుల ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఆరంభంలోనే జార్జ్ లిండే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఐడెన్ మార్క్రామ్ (38), ర్యాన్ రికెల్టన్ (44) బౌండరీలతో హోరెత్తించారు. వీరిద్దరి విధ్వంసంతో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. ఎన్నో అంచలనాల మధ్య బ్యాటింగ్ కు దిగిన బ్రేవీస్ (2), మిల్లర్ (13) విఫలమయ్యారు. అయితే జేసన్ స్మిత్ (35), మార్కో జాన్సెన్ (26) మెరుపులు మెరిపించి ఫలితం లేకుండా పోయింది. స్టబ్స్ 21 బంతుల్లోనే 45 పరుగులు చేసి విధ్వంస సృష్టించినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. భారీ స్కోర్ కావడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. అర్షదీప్ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.
బ్యాటింగ్ లో చెలరేగిన టీమిండియా:
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మంచి ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. తొలి ఓవర్లోనే కిషాన్ రెండు సిక్సర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లు బాది తన దూకుడు చూపించాడు. ఐదో ఓవర్లో కిషాన్ విధ్వంసమే సృష్టించాడు. ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. వీరిద్దరి ధాటికి ఇండియా పవర్ ప్లే లో ఏకంగా 83 పరుగులు చేసింది. 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి రిటైర్డ్ ఔటయ్యాడు. ఓపెనర్ల తర్వాత తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ షో సాగింది.
వీరిద్దరి ధాటికి 9 ఓవర్లో మూడు సిక్సర్లతో 20 పరుగులు వచ్చాయి. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి తిలక్ 19 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య కూడా వేగంగా ఆడి 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. 23 బంతుల్లో 35 పరుగులు చేసి రాణించాడు. హార్దిక్ పాండ్య అయితే నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్ తో కిక్ ఇచ్చాడు. కేవలం 10 బంతుల్లోనే 30 పరుగులు చేసి చివర్లో రెచ్చిపోయి ఆడాడు. పాండ్య ఇన్నింగ్స్ తో ఇండియా స్కోర్ 240 పరుగులకు చేరుకుంది. సంజు శాంసన్ బ్యాటింగ్ ను దించలేదు.
