- మహబూబ్‌నగర్‌కు బీజేపీ చీఫ్ నితిన్ నబీన్
- 7న మంచిర్యాలకు మహారాష్ట్ర సీఎం..
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. లోకల్ ఫైట్‌లో సత్తా చాటేందుకు ఢిల్లీ నుంచి పెద్దలను దించుతున్నది. ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని చేపట్టింది. జాతీయ నేతలను, పొరుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులను ప్రచారానికి రప్పిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను పెట్టి ప్రచారాన్ని కొనసాగిస్తున్నది. ప్రచారానికి సమయం తక్కువ ఉండటంతో, ముఖ్య నేతలను రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నది.
బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్‌నగర్ తో ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ నెల 7న మంచిర్యాలలో జరిగే భారీ బహిరంగ సభకు మహారాష్ట్ర సీఎం చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. 7, 8 తేదీల్లో పవన్ పర్యటన ఖరారైంది. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర ముఖ్య నేతలు కూడా త్వరలోనే ప్రచారానికి రాన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మున్సిపాలిటీల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రచారం చూపించలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ పరిధిలోని మక్తల్, అమనగల్ ను మాత్రమే గెలుచుకుంది. మొత్తం 120 మునిసిపాలిటీల్లో 2,727 వార్డులుంటే.. బీజేపీ కేవలం 237 వార్డులు దక్కించుకుంది. అయితే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు బీజేపీ తరఫున విజయం సాధించడంతో మంచి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మేయర్, చైర్మన్ పీఠాలు గెలుచుకోవాలని
మోదీ చరిష్మా చూసి యువత, విద్యావంతులు ఓట్లేస్తారని బీజేపీ నమ్ముతున్నది. అందుకే ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా చెప్పుకోదగ్గ సంఖ్యలో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుని.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది.
