- స్టార్టప్ ఎకోసిస్టమ్ బలంగా కనిపిస్తోందన్న ముకేశ్ అంబానీ
- 20 ఏళ్లలో జీడీపీ 20–30 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కామెంట్
ముంబై: ప్రస్తుతం ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ బలంగా ఉందని, రిలయన్స్ లాంటి 100 సంస్థలు పుట్టొచ్చని ఈ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. జియోబ్లాక్‌రాక్ ఫైర్‌సైడ్ చాట్‌లో బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని, 8–10 శాతం జీడీపీ వృద్ధి సాధించగలిగే సత్తా ఉందని తెలిపారు. ఇంకో 20 ఏళ్లలో 20–30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు, క్రమశిక్షణతో కూడిన ఆర్థిక చర్యలు ఈ వృద్ధికి సాయపడుతున్నాయన్నారు.
అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడుతూ, కీలక వాణిజ్య ఒప్పందాల తర్వాత భారత్‌తో గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ బలపడిందని, ప్రపంచ పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు భారత దీర్ఘకాలిక అవకాశాలను గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. “బడ్జెట్ తర్వాత ఈయూ ఒప్పందం, అమెరికా, ఇండియా డీల్ జరిగాయి. భారత్ ఇప్పుడు అనేక దశాబ్దాల వృద్ధికి పునాది వేస్తోంది. ప్రపంచం భారత్‌ను గమనిస్తోంది” అని అంబానీ తెలిపారు. “ఇండియన్స్ గత ఐదారు దశాబ్దాలుగా నిలకడగా పొదుపు చేసుకుంటూ వస్తున్నారు. ఇక నుంచి సంపద సృష్టించే అసెట్స్ వైపు మారాలి. జియోబ్లారాక్‌తో తమ సేవింగ్స్‌ను సంపదగా మార్చుకునే అవకాశాన్ని అందిస్తున్నాం”అని ఆయన పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో ఇండియా తన ఎనర్జీ అవసరాల్లో 80 శాతాన్ని లోకల్‌గా ఉత్పత్తి చేసుకుంటుందని చెప్పారు. ఏఐ బబుల్ లేదని, టెక్నాలజీలో తక్కువ ఇన్వెస్ట్ చేస్తేనే రిస్క్ ఎక్కువని బ్లాక్‌రాక్ సీఈఓ ల్యారీ ఫింక్ పేర్కొన్నారు.
