ముందు బలోపేతం.. ఆ తర్వాత విలీనం!... మెప్మాపై సర్కార్ స్పెషల్ ఫోకస్‌‌

ముందు బలోపేతం.. ఆ తర్వాత విలీనం!... మెప్మాపై సర్కార్ స్పెషల్ ఫోకస్‌‌
  •     ఆ తర్వాతే సెర్ప్‌‌, మెప్మా ఒకే గొడుగు కిందకు
  •     గ్రామాల విలీనంతో మెప్మా పరిధిలోకి 10 వేల సంఘాలు
  •     తమను సెర్ప్‌‌లోనే కొనసాగించాలంటున్న మహిళలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌‌హెచ్‌‌జీ) వ్యవస్థను ఏకీకృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని సెర్ప్ తో పోలిస్తే మెప్మా  బలహీనంగా ఉందనే అభిప్రాయం ఉంది. దీంతో  మెప్మాను బలోపేతం చేసి ఆ తర్వాత రెండు విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. 

రెండింటినీ విలీనం చేయడం వల్ల కొన్ని స‌‌మ‌‌స్యలు ఉత్పన్నమ‌‌వుతుండ‌‌డంతో ముందుగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందికి, ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 

సంఘాల సభ్యులకు పొదుపు, తీసుకున్న రుణాలు చెల్లింపులు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌‌యూఎల్ఎం) నుంచి రావాల్సిన పెండింగ్​ నిధులు రూ. 26 కోట్లను ఇటీవల మెప్మాకు వచ్చాయి. వీటిని వినియోగించుకుంటే మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని వీటి ద్వారా మహిళా సంఘాలను బలోపేతం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సెర్ప్ వర్సెస్ మెప్మా

రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్ పరిధిలో 60 లక్షల మంది సభ్యులు ఉండగా.. మెప్మా పరిధిలో 20 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. సెర్ప్ యంత్రాంగం బలంగా ఉంది. ఇందులో 4 వేలపైగా మంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో సీసీలు, ఏపీఎంల పర్యవేక్షణ పకడ్బందీగా ఉంటుంది. రుణాల మంజూరు, రుణాల చెల్లింపులు క్రమశిక్షణతో ఉంటాయి. సెర్ప్ ఆధ్వర్యంలో  మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు సభ్యులు స్వశక్తితో ముందుకెళ్తున్నారు. 

కానీ మెప్మాలో సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం వంటి సమస్యలున్నాయి. మెప్మాలో ఆఫీసర్లు అంతా కలిపితే 400 మందిలోపే ఉంటారు. దీంతో సంఘాల్లో పొదుపులు, ఇతర కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయి. అయితే, మెప్మా, సెర్ప్ సంఘాలను విలీనం చేస్తే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తడంతోపాటు పొదుపు సంఘాల వ్యవస్థపై ప్రభావం చూపుతుందని గుర్తించారు. దీంతో  మెప్మాలోని కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు, మిషన్ కో-ఆర్డినేటర్లకు విస్తృత స్థాయి శిక్షణ ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. 

మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలోకి 10 వేల సంఘాలు

రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీలు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమయ్యాయి. భౌగోళికంగా పట్టణ పరిధిలోకి మారడంతో 10 వేలకుపైగా స్వయం సహాయక సంఘాలు మెప్మా పరిధిలోకి వెళ్లాయి. అయితే, ఈ సంఘాలు ఇప్పటికీ టెక్నికల్​గా సెర్ప్‌‌లోనే కొనసాగుతున్నాయి. సెర్ప్ ద్వారానే బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, బీమా అందుతుండటంతో ఈ సంఘాలు మెప్మాలో విలీనానికి సుముఖత చూపడం లేదు. భవిష్యత్​లో తమను మెప్మాలో విలీనం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.