- సిటీలో ఘనంగా ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే
నెట్వర్క్, వెలుగు: క్యాన్సర్ వస్తే జీవితం ముగిసిందన్న భయం ప్రజల్లో ఉందని, కానీ అనేక మంది క్యాన్సర్‌ను జయించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిటీలో క్యాన్సర్ డే సందర్భంగా బుధవారం అవగాహన కార్యక్రమాలు జరిగాయి. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జీవనశైలి ఆధారంగానే అనేక వ్యాధులు వస్తున్నాయని, అందుకే లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలన్నారు. రాయదుర్గం ఆరేటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న ఆరేటి సైక్లోథాన్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ రన్‌కు సంబంధించిన 7.5కె, 24కె రన్ పోస్టర్, టీ షర్ట్‌ను నటి ఐశ్వర్య రాజేశ్ ఆవిష్కరించారు. రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో సిటీలోని రెనోవా హాస్పిటల్స్ బ్రాంచ్‌ల నుంచి బైక్‌ర్యాలీ ప్రారంభించి నెక్లెస్ రోడ్‌కు చేరుకున్నారు. నిమ్స్ దవాఖానలో బుధవారం ఉదయం క్యాన్సర్‌పై అవగాహన భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత ఉచిత క్యాన్సర్ స్ర్కీనింగ్క్యాంప్ను డైరెక్టర్ డాక్టర్బీరప్ప ప్రారంభించారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో విద్యార్థులు క్యాన్సర్ అవేర్నెస్ ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే అత్యాధునిక పరీక్షలు నిర్వహించే స్క్రీనింగ్ బస్సును అందుబాటులోనికి తెచ్చారు. బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ నూతన బస్సును ప్రారంభించారు.
మల్లారెడ్డి నారాయణలో ఉచిత స్క్రీనింగ్ క్యాంప్
మేడ్చల్, వెలుగు: యునైటెడ్ బై యూనిక్ థీమ్ తో మల్లారెడ్డి నారాయణ దవాఖానలో క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దవాఖానల చైర్మన్ డాక్టర్ సి.హెచ్. భద్రారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. వైస్ చైర్మన్డాక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ మహిళల్లో బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్లపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, రాకేష్, ప్రభు, పాల్గొన్నారు. ఈ స్క్రీనింగ్క్యాంప్ఈ నెల 11వరకు కొనసాగుతుందన్నారు.
రూ.999 కే క్యాన్సర్ స్క్రీనింగ్
హైదరాబాద్ సిటీ: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లిలో అమోర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన వాకథాన్ నిర్వహించారు. ఇందులో డాక్టర్లు, క్యాన్సర్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాము రూ.999లకే సంపూర్ణ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ ప్రవేశపెట్టామని అమోర్ హాస్పిటల్స్ ఎండీ డా. కిషోర్ బి. రెడ్డి ప్రకటించారు.
