- అగ్రికల్చర్ కనెక్షన్లపై టీజీఈఆర్సీ శుభవార్త
- కొత్త నిబంధనలతో గెజిట్ విడుదల
- రైతులపై తగ్గనున్న ఫీజుల భారం
- అపార్ట్మెంట్లకు విద్యుత్ కనెక్షన్ల ప్రాసెస్ కూడా సులభతరం
హైదరాబాద్, వెలుగు: రైతులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్ సీ) శుభవార్త తెలిపింది. అదనపు విద్యుత్ స్తంభాల కోసం గతంలో లాగా ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ (ఓఆర్సీ) కింద విద్యుత్ సంస్థలకు రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇక నుంచి కేటగిరీల వారిగా విద్యుత్ కనెక్షన్ల మంజూరు కోసం తీసుకోవాల్సిన చార్జీల సవరణ రేట్లను ఇందులో ప్రకటించింది. దీని ప్రకారం ఇకపై రైతులు కిలోవాట్‌కు రూ.1000 చొప్పున ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్ కావాలనుకుంటే ఆ మేరకు చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. సిబ్బంది కరెంట్ కనెక్షన్ మంజూరు చేస్తారు.
గతంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే రైతు పొలంలో ఉన్న మోటారు.. మూడు విద్యుత్ స్తంభాలలోపు దూరంలో ఉంటే కనెక్షన్ ఇచ్చేవారు. మూడు స్తంభాల దూరం దాటితే అదనపు స్తంభాల కోసం గాను ఔట్ రైట్ కంట్రిబ్యూషన్ కింద రైతు విద్యుత్ శాఖకు రూ.40 వేలకు పైగా డబ్బులు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. టీజీఈఆర్సీ ఇచ్చిన నూతన గెజిట్ ప్రకారం రైతులకు ఈ భారం తొలగిపోనుంది. ఇకపై 20 హెచ్‌పీలోపు మోటార్లకు అయితే కిలోవాటుకు రూ.1000 చొప్పున ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
అపార్ట్మెంట్లకు ఈజీ ప్రాసెస్
సిటీల్లోని అపార్ట్మెంట్లలో నివసించే ప్రజలకు కూడా టీజీఈఆర్సీ తీపికబురు చెప్పింది. అపార్ట్ మెంట్లు, హై రైజ్డ్ బిల్డింగ్‌లలో నివసించే వాళ్లు కరెంటు కనెక్షన్ తీసుకోవటం ఇక ఈజీ కానున్నది. దీంతో ఎస్టిమేషన్స్ పేరిట జరిగే దందాలకు తెరపడే అవకాశం ఉంది. ఇకపై ఈఆర్సీ రేట్ల ప్రకారం ఆన్లైన్లో ఫీజు చెల్లిస్తే కనెక్షన్ ఇవ్వాల్సిందే. డొమెస్టిక్ కేటగిరీలో ఒక కిలోవాట్‌కు రూ. 500, ఒక కిలోవాట్ దాటి 5 కిలోవాట్ల దాకా కనీస చార్జి రూ.500, ప్రతి కిలోవాటుకు రూ.600 చొప్పున చెల్లించాలి.
అలాగే 5 కిలోవాట్లు దాటి 20 కిలోవాట్ల దాకా కనీస చార్జి రూ.2,900, ప్రతి కిలోవాటుకు రూ.1,500 చొప్పున, 20 కిలోవాట్ల పైన అయితే ప్రతీ కిలోవాటుకు రూ.10 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్లకు అవసరమైన కరెంట్ లైన్లు వేయడం, ట్రాన్స్ ఫార్మర్లను బిగించడం డిస్కమ్ ల బాధ్యతే అని ఈఆర్సీ స్పష్టం చేసింది.
సవరించిన చార్జీల వివరాలు ఇలా..
డొమెస్టిక్ కేటగిరీ: ఒక కిలోవాట్‌కు రూ. 500. ఒక కిలోవాట్ దాటి 5 కిలోవాట్ల దాకా కనీస చార్జి రూ.500, ప్రతి కిలోవాటుకు రూ.600 చొప్పున చెల్లించాలి. అలాగే 5 కిలోవాట్లు దాటి 20 కిలోవాట్లదాకా కనీస చార్జి రూ.2,900, ప్రతి కిలోవాటుకు రూ.1500.. 20 కిలోవాట్ల పైన అయితే ప్రతీ కిలోవాటుకు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.
నాన్ డొమెస్టిక్, కమర్షియల్ కేటగిరీ: ఒక కిలోవాట్ దాకా కనీస చార్జి రూ. 1000. ఒక కిలో వాట్ దాటి 5 కిలోవాట్ల దాకా కనీస చార్జి రూ.1,000, ప్రతి కిలోవాట్ కు రూ.1200. అలాగే 5 కిలోవాట్లు దాటి 20 కిలోవాట్లదాకా కనీస చార్జి రూ.5,800, ప్రతి కిలోవాట్‌కు రూ.2,000 చొప్పున కట్టాలి.
ఇండస్ట్రీస్, ఎల్టీ 3 కేటగిరీ: 20 కిలోవాట్ల దాకా ప్రతీ కిలోవాటుకు రూ.4 వేలు. 20 కిలోవాట్ల పైన అయితే ప్రతీ కిలోవాటుకు రూ.10 వేల చొప్పున చెల్లించాలి.
కుటీర పరిశ్రమలు, ఎల్టీ 4 కేటగిరీ: 19 కిలోవాట్లదాకా ప్రతీ కిలోవాటుకు రూ.1000 చొప్పున చెల్లించాలి.
వ్యవసాయం, ఎల్టీ 5 కేటగిరీ: 20 హెచ్‌పీలోపు అయితే కిలోవాటుకు రూ.1000 చొప్పున ఫీజు కట్టాలి. రైతులు ఓఆర్సీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు, ఎల్టీ 9 కేటగిరీ: కిలోవాట్ దాకా రూ.1000 కట్టాలి. 1 కిలోవాట్ నుంచి 20 కిలోవాట్లదాకా రూ.1000, ప్రతీ కిలోవాటుకు రూ.1,200. అలాగే 20 కిలోవాట్లు దాటితే ప్రతి కిలోవాటుకు రూ.8 వేల చొప్పున చెల్లించాలి.
